టీడీపీకి బీసీలను దూరం చేస్తున్నారు-సీఎం
Publish Date:Jan 21, 2019
Advertisement
బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరిస్తున్నారని, వాళ్ల బెదిరింపులకు ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరని ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాజాగా చంద్రబాబు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ.. ఏపీకి ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ ఏపీకి ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో పర్యటించేందుకు వారానికి ఓ కేంద్రమంత్రి వస్తారని, రాష్ట్రానికి ఏం మేలు చేశారని వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పైగా బెదిరింపులు కూడా చేస్తున్నారన్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ, టీఆర్‌ఎస్ లాలూచీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు టీడీపీ నేతలకు పిలుపు ఇచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కేసీఆర్ నిందించారని, 'రాజా ఆఫ్ కరప్షన్' పుస్తకంపై కేసీఆర్‌దే రెండో సంతకమని అన్నారు. ఇప్పుడు అదే వైఎస్‌పై కేసీఆర్ పొగడ్తలు కురిపిస్తున్నారని విమర్శించారు. నిన్న అసెంబ్లీలో కేసీఆర్ వైఎస్‌ను పొగిడారన్నారు. జగన్‌తో కేటీఆర్ భేటీ అయి వారం రోజులు కూడా కాలేదని, జగన్ వెంటనే కేసీఆర్‌కు లేఖ రాశారన్నారు.ప్రధాని మోడీ డైరెక్షన్‌లో టీఆర్‌ఎస్, వైసీపీ కలిశాయని చంద్రబాబు అన్నారు. బీసీలలో అపోహలు తేవాలని వైసీపీ, టీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని, బీసీలను టీడీపీకి దూరం చేసే కుతంత్రాలు పన్నుతోందని సీఎం మండిపడ్డారు. మూడు పార్టీల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీసీలే సంఘటితంగా ఈ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. చిత్తూరుకు కృష్ణా జలాలు రావడం ఒక చరిత్ర అని.. కృష్ణా జలాలకు రాయలసీమ ప్రజలు హారతులు పడుతున్నారని చెప్పారు. నాలుగు సీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వగలిగామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామన్నారు. ప్రతిపక్షం పూర్తిగా డీలాపడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలపై ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల సభకు 10లక్షల మందికి పైగా తరలివచ్చారని.. అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభను దీనికి దీటుగా నిర్వహించాలని నేతలకు సూచించారు. 22 పార్టీల నేతలు సభకు వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. మోడీ పాలనలో సంక్షేమం పడకేసిందని,నెగిటివ్ లీడర్‌గా మోడీ మారారని విమర్శించారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-teleconference-with-tdp-leaders-39-85405.html





