రోడ్డెక్కనున్న ఏపీ కియా కారు
Publish Date:Jan 21, 2019
Advertisement
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం దగ్గర దక్షిణ కొరియా కార్ల దిగ్గజం ‘కియా మోటార్స్ ఇండియా’ కంపెనీ కార్ల ఉత్పత్తికి ప్లాంటును ఏర్పటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ప్లాంట్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నెలాఖరుకల్లా ఈ ప్లాంట్‌లో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభిస్తామని కియా మోటార్స్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ చెప్పారు. తొలుత ఈ ప్లాంట్‌లో ‘ఎస్‌పీ 2ఐ’ కాన్సెప్ట్ ఎస్‌యూవీ వాహనాలు ఉత్పత్తి చేయాలని ఈ దక్షిణ కొరియా కార్ల దిగ్గజం భావిస్తోంది. గత ఏడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శించింది. ఈ ఏడాది జూన్, జూలై నాటికి ఎస్‌పీ 2ఐ’ కాన్సెప్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో ఉంటుందని భట్ చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు. ‘ఏటా మూడు లక్షలకుపైగా కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌లో ఈ నెలాఖరుకల్లా ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభిస్తామనే నమ్మకంతో ఉన్నాం. ముందుగా ఇక్కడ ‘ఎస్‌పీ 2ఐ’ కార్ల ఉత్పత్తి చేపడతాం’ అని భట్ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఈ కారు భారత మార్కెట్‌కు అనుగుణంగా ఉందా? లేదా? అనే విషయాన్నీ పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా కియా మోటార్స్‌కు ఇది 15వ ప్లాంట్. భారత్‌లో మాత్రం తొలి ప్లాంట్. కంపెనీ 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,200 కోట్లు) పెట్టుబడితో రెండు దశల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో మొదటి దశ కోసం 110 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేస్తోంది. 2021 నాటికి మరో 80 కోట్ల డాలర్ల పెట్టుబడితో అనంతపురం ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరించాలని భావిస్తోంది. రెండో దశ విస్తరణతో ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 10,000కు చేరుతుందని అంచనా.
http://www.teluguone.com/news/content/kia-to-begin-trial-production-at-anantapur-in-this-month-39-85406.html





