లోక్ సభ ఎన్నికల్లో బాలీవుడ్ నటి
Publish Date:Jan 21, 2019
Advertisement
ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాగా తాజాగా మరో నటికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ టికెట్‌ను ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని.. దానిలో భాగంగా ఇక్కడ నుంచి కరీనాను పోటీ చేయిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ లు ఆ పార్టీ అధిష్ఠానానికి సూచించినట్లు సమాచారం. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాక మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కోడలు వంటి అంశాలు కరీనా గెలిచేందుకు సహకరిస్తాయని గుడ్డు చౌహన్ విశ్వసిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తాత ఒకప్పుడు భోపాల్ నవాబ్‌గా ఉన్నారు. దాంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కరీనా.. కాంగ్రెస్ తరఫున భోపాల్ నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తుందని గుడ్డు చౌహాన్ అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడక ముందే బీజేపీ నాయకులు విమర్శించడం ప్రారంభించారు. బీజేపీని ఎదుర్కోగల బలమైన అభ్యర్థి కాంగ్రెస్‌లో ఎవరూ లేరు. అందుకే సినితారలను నిలబెట్టాలని భావిస్తోంది. స్థానిక నాయకులు ఎవరూ ఆ పార్టీకి కనిపించడం లేదంటూ బీజేపీ విమర్శిస్తోంది. మన్సూర్ అలీఖాన్ పటౌడి 1991 లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుశీల్ చంద్ర వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. మరి ఆయన కోడలు అయిన కరీనా గెలుస్తుందో లేదో? కాంగ్రెస్ ఆమెకి టికెట్ ఇస్తుందో లేదో? అసలు ఇంతకీ కరీనాకి పోటీ చేయటానికి ఆసక్తి ఉందో? లేదో? ..ఇలా ఎన్ని ప్రశ్నలో వీటన్నింటికి అటు కరీనా అయినా ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా అధికారిక ప్రకటన చేస్తేగాని క్లారిటీ రాదు.
http://www.teluguone.com/news/content/congress-gives-bhopal-lok-sabha-ticket-to-kareena-kapoor-39-85402.html





