ఆనం బ్రదర్స్ కోసం బాబు మాస్టర్ ప్లాన్
Publish Date:Aug 9, 2017
Advertisement
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేతల్లో ఆనం బ్రదర్స్ ప్రముఖులు.. కాంగ్రెస్ హయాంలో జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషించారు ఈ అన్నదమ్ములు. అయితే రాష్ట్ర విభజన పేరిట కాంగ్రెస్ చేసిన ఘోరమైన తప్పిదం హస్తం పార్టీకి చెందిన ఎంతోమంది నేతల రాజకీయ భవిష్యత్తును సమాధి చేసింది. ఆనం బ్రదర్స్‌కు కూడా ఇది తప్పలేదు. దీంతో అన్నదమ్ములిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి రాకను పార్టీలో చాలా మంది స్వాగతించారు కూడా అయితే పార్టీ తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కనబెట్టిందని ఆనం బ్రదర్స్ లోలోపల కుమిలిపోతున్నారు. దీంతో వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించే చర్యలు చేపట్టారు. తన కలల ప్రాజెక్ట్‌ను ఆనం రామనారాయణ రెడ్డి చేతికి అప్పగించనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అవేంటంటే చంద్రన్న భీమా, ఎన్టీఆర్ హౌసింగ్ ఈ రెండు ప్రాజెక్ట్‌లను సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చివరికి అధికారుల చేతిలో కూడా పెట్టకుండా తానే స్వయంగా వీటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో మీకు పని ఒత్తిడి ఎక్కువ అవుతోంది..కొన్నింటిని అధికారులకు అప్పగించాలని సన్నిహితులు సూచించినా ముఖ్యమంత్రి వినడం లేదట. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఆనం బ్రదర్స్ పార్టీ మారేందుకు సన్నాహలు చేస్తున్నారనే వార్త చంద్రబాబు చెవిన పడింది. వారు టీడీపీని వీడితే నెల్లూరు జిల్లాపై పట్టు జారిపోతుందని సీనియర్ నేతలు సూచించడంతో ముఖ్యమంత్రి కాస్త ఆలోచనలో పడ్డారు. దీంతో ఆనం బ్రదర్స్ పార్టీ మారకుండా కీలక బాధ్యతలు అప్పగించాలని భావించినట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డికి ప్లానింగ్, ఆర్ధిక వ్యవహారాల్లో దిట్టగా మంచి పేరుంది..అలాంటి వ్యక్తికి తన కలల ప్రాజెక్ట్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఓ వైపు ఆనం సోదరులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇప్పటికే వారు వైసీపీకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు అవుతుందని బాబు ప్లాన్‌గా తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-45-76937.html





