ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అరెస్టు.. తరువాత కవితేనా?
Publish Date:Feb 26, 2023
Advertisement
ముందు నుంచీ అనుకున్నట్లుగానే లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. సీబీఐ ఆదివారం (ఫిబ్రవరి 26) ఆయనను విచారించి ఆ తరువాత అరెస్టు చేసింది. ఉదయం నుంచి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు అనంతరం అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. ఇక్కడ తప్పని సరిగా ప్రస్తావించాల్సిన అవసరమేమిటంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తారని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మోడీ సర్కార్ ను వ్యతిరేకించే పార్టీలూ, నాయకుల లక్ష్యంగానే పని చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణను కేవలం ఆప్ మాత్రమే చేయడంలేదు. బీజేపీయేతర పార్టీలన్నీ చేస్తున్నాయి. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు వాటి ప్రతిష్టకు వన్నె తేచ్చేదిగా ఎంత మాత్రం లేదని సామాన్య జనం కూడా అభిప్రాయపడే విధంగా ఉందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అదలా ఉంచితో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడంతో ఇక తరువాతి వంతు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సౌత్ గ్రూప్ కు చెందిన కవిత, రామచంద్ర పిళ్లై మినహా మిగిలిన వారంతా అరెస్టయ్యారు. దీంతో తదుపరి అరెస్ట్ కవితనే కావొచ్చని అంటున్నారు. ఇప్పటికే కవితను సీబీఐ ఒక సారి విచారించింది. మరో సారి విచారణకు నోటీసులు జారీ చేసినా.. విచారణకు ఎప్పుడు హాజరు కావాలన్నది స్పష్టం చేయలేదు. ఇప్పుడు మనీష్ సిసోడియా అరెస్టుతో రోజుల వ్యవధిలోనే కవితనూ విచారించే అవకాశం ఉందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/cbi-arrested-manish-sisodia-39-151929.html





