జోడో .. హస్తానికి జీవన్ టోన్ టానిక్ అవుతుందా?
Publish Date:Feb 26, 2023
Advertisement
కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఏమి చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అనేది పక్కన పెడితే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పాతికేళ్ళకు పైబడిన తమ రాజకీయ జీవితంలో తొలి సారిగా చేపట్టిన భారత్ జోడో యాత్ర... చుట్టూనే ప్లీనరీ చర్చలు సాగిన వైనం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి, అసలు అందు కోసమే ప్లీనరీ సమావేశాలు నిర్వహించారా అన్న విధంగా పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొదలు, ప్రస్తుత అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే వరకు, వేదిక ఎక్కిన ప్రతి నాయకుడు, నాయకురాలు జోడో యాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. రాహుల్ గాంధీని అభినందిచారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 145 రోజుల పాటు సాగిన రాహుల్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యం రాజకీయ, ఎన్నికల ప్రయోజనాలు కాదని రాహుల్ గాంధీని దగ్గరుండి నడిపించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్, వంటి నాయకులు యాత్ర పొడుగునా చెప్పినా, ఇప్పడు ప్లీనరీలో మాత్రం జోడో యాత్రే కాంగ్రెస్ పార్టీకి బలాన్నించే, జీవన్ టోన్ టానిక్ అనే విధంగా ప్రసంగాలు సాగాయి. నిజమే, దేశంలో మహాత్మా గాంధీ మొదలు చంద్ర శేఖర్ (మాజీ ప్రధాన మంత్రి) వరకు, వైఎస్సార్ మొదలు చంద్రబాబు, జగన్ వరకూ చాలా మంది నాయకులు పాదయాత్రలు చేశారు. నిజానికి, నడుస్తున్న పవర్ పాలిటిక్స్ చరిత్రలో పాదయాత్ర రాజకీయ పాఠ్యాంశంగా మారిపోయింది. అలాగే, అధికారానికి దగ్గరిదారి (షార్ట్ కట్) పాదయాత్ర అనే అభిప్రాయం కూడా ఏర్పడింది. అయితే పాదయాత్ర చేసిన వారంతా పవర్ లోకి వస్తారా , అంటే అయితే అది వేరే విషయం. వేరే చర్చ. అదలా ఉంచి మళ్ళీ, ప్లీనరీ ప్రసంగాలలోకి వస్తే, ఆ ప్రసంగాలను గమనిస్తే, సోనియా గాంధీ మొదలు రాహుల్ గాంధీ వరకు జోడో యాత్ర సక్సెస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారనే విషయం అర్థమవుతుంది. అలాగే జోడో యాత్ర సక్సెస్ (?) విషయంగా అందరికంటే సోనియా గాంధీనే ఎక్కువ ఆనందించారు. నిజమే, కొడుకు ప్రయోజకుడు అయితే, ఏ తల్లి మాత్రం సంతోషించదు. అందులోనూ సోనియాజీ, రాహుల్ గాంధీని ప్రయోజకుడిగా చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. సో .. రాహుల్ జోడో యాత్ర సక్సెస్ విషయంగా సోనియాజీ అంతలా ఆనందపడి పోయారని అనుకోవచ్చును. అందుకే ఆమె జోడోకు ముడివేసి క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇకపై పదవులకు దూరంగా ఉంటానని చెప్పు కొచ్చారు. అలాగే కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జోడో ..జీవన్ టోన్ టానిక్ అందించిన శక్తితో రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే విశ్వాసాన్నిసోనియాజీ వ్యక్తం చేశారు. అలాగే, రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్రతో తాను ప్రజలకు మరింత దగ్గరయ్యానని అన్నారు. జోడో యాత్ర తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని చెప్పారు. జోడో యాత్ర నేర్పిన పాఠాలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అయితే నిజంగా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఆశిస్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవ స్థితిని తీసుకు వస్తుందా? కనీసం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశిస్తున్న విధంగా, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా? అంటే అది ఇప్పుడే చెప్పలేమని, 2024కు ముందు 2023 పరీక్షను ముఖ్యంగా, కర్ణాటక ఫలితాలను బట్టే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. నిజానికి, అంత వరకు కూడా ఆగవలసిన అవసరం లేదు.. వచ్చే నెల మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జోడోయాత్ర హిట్టా ..ఫట్టా అనేది తెలిపోతుందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/will-jodo-yatrra-become-jivan-tone-tonic-to-congress-39-151927.html





