నేను సైతం అంటున్న బొత్స
Publish Date:Nov 30, 2013
Advertisement
పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నిన్న ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నపటికీ, సాంకేతిక లేదా రాజకీయ కారణాల వలన రాష్ట్ర విభజన జరగకపోవచ్చని నా రాజకీయ అనుభవంతో చెపుతున్నాను’ అని చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతవరకు సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్రమంత్రులు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగబోదని చివరి వరకు హామీలు గుప్పిస్తూ, రాజినామాలంటూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. ఇప్పుడు వారే ప్యాకేజీల గురించి గట్టిగా కృషిచేస్తున్నట్లు మీడియా ముందు చాలా హడావుడి చేయడం ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగబోదని గట్టిగా హామీలు ఇచ్చినవారు ఇప్పుడు ప్యాకేజీల గురించి పోరాడుతుంటే, “హిందీ ఓళ్ళకి పది రాష్ట్రాలుండగా, మనోళ్ళకి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేటి?” అంటూ నిన్నమొన్నటి వరకు రాష్ట్ర విభజన సమరిస్తూ వచ్చిన బొత్ససత్యనారాయణ, ఇక నేడో రేపో రాష్ట్ర విభజన జరగబోతున్న ఈ తరుణంలో తను సమైక్యవాదినని, రాష్ట్ర విభజన జరుగకపోవచ్చునని అనడంలో ఉద్దేశ్యం ఏమిటి? రాజకీయ లేదా సాంకేతిక కారణాలతో విభజన ప్రక్రియ ఆగిపోవచ్చని ఆయనకు తెలిసిన విషయం మరి కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదా లేక తెలిసినప్పటికీ ఏమి తెలియనట్లు ముందుకు సాగుతోందనుకోవాలా? లేకపోతే కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయంపై ఉన్న అవగాహన, వ్యూహం గురించి బొత్సకే అవగాహన లేదనుకోవాలా? రాష్ట్రంలో తమ కాంగ్రెస్ నేతలే ఈ గందరగోళానికి కారకులని చెపుతున్న బొత్ససత్యనారాయణ మరి తను చేస్తున్నదేమిటి?
http://www.teluguone.com/news/content/botsa-satyanarayana-39-27935.html





