బాలినేనికి వైసీపీ పొమ్మనలేక పొగ.. పార్టీలో ఆయన సీన్ అయిపోయిందా?
Publish Date:May 30, 2022
Advertisement
ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీలో పొమ్మనలేక పొగ పెడుతున్నారా అంటే ఆయన వర్గీయులే ఔనని చెబుతున్నారు. ఆ కారణంగానే బాలినేనిలో గతంలో ఉన్నంత ఊపు.. ఉత్సాహం.. కనిపించడం లేదంటున్నారు. ఇటీవల వైయస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మొక్కుబడిగా పాల్గొనడమే కాకుండా, కొత్తపట్నం మండలంలోని అల్లూరులో బాలినేని జనంపై బూతు పురాణంతో విరుచుకుపడటాన్ని బాలినేనిలో పెరిగిపోయిన ఫ్రస్ట్రేషన్ కు తార్కానంగా చూపుతున్నారు. బాలినేనిని జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడానికి కారణాన్ని సైతం బాలినేని వర్గీయులు ఆఫ్ ది రికార్డ్ సోదాహరణంగా వివరిస్తున్నారు. బాలినేని డైహార్ట్ ఫ్యాన్ అయిన సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడి, అనంతర పరిణామాలతో బాలినేని అంటే నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్ లో భయాందోళలను చోటుచేసుకున్నాయనీ, దీంతో క్యాడర్ ఆయన దగ్గరకు రావడానికే జంకే పరిస్థితి ఏర్పడిందని, అందుకే జగన్ ఆయనను దూరం పెట్టాడనీ వారు చెబుతున్నారు. అంతే కాకుండా వైసీపీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మ, జగన్ సోదరి షర్మిలతో బాలినేని బంధుత్వం కొనసాగించడం జగన్ ఫ్యామిలీలో అసంతృప్తికి కారణం అవ్వడం కూడా బాలినేని మంత్రి పదవికి ఎసరు రావడానికి కారణమని ఆయన వర్గీయులు చబుతున్నారు. దీంతో ఆయనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడమే కాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం పెట్టడం ద్వారా పొమ్మన లేక పొగబెట్టిన పరిస్థితిని పార్టీ తీసుకువచ్చిందని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా బాలినేనికి వేదికపై కనీసం స్థానం లేకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇక తాజాగా ఒంగోలులో జరిగిన తెలుగుదేశం మహానాడు సక్సెస్ అవ్వడం కూడా ఆయనపై నెగటివ్ ప్రభావం పడేందుకు కారణమైందని బాలినేని వర్గీయులు అంటున్నారు. మొత్తం మీద వైసీపీలో బాలినేని సీన్ అయిపోయినట్లేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/balineni-seen-close-in-ycp-39-136700.html





