అధికారులూ జాగ్రత్త.. నిబంధనలు మీరొద్దు.. చిక్కుల్లో పడొద్దు!
Publish Date:Jun 20, 2022
Advertisement
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా జగన్ పాలన కోనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతూ కోర్టులు ఎన్ని సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా జగన్ పట్టించుకోవడం లేదు. నా ప్రభుత్వం.. నా ఇష్టం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. 151 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టడానికి కోర్టులకు అధికారమేమిటన్నట్లుగా ఆయన పాలనా ధోరణి కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా, ఆక్షింతలు జల్లినా, ఐఏఎస్ అధికారులకు శిక్షలు విసినా, జరిమానాలు వేసినా జగన్ సర్కార్ తీరు ఏ మాత్రం మారడం లేదు. నిరసన తెలపడానికి విపక్ష నేతలకు హక్కే లేదన్నట్లుగాఆక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్న జగన్ సర్కార్ నేరస్తులకు మాత్రం రాచమర్యాదలు చేస్తున్నదని విమర్శిస్తున్నారు. అనంతబాబు విషయమే తీసుకుంటే.. విచారణలో తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. పోలీసులు ఇంత వరకూ ఆయనను తమ కస్టడీకి తీసుకోవడానికి కోర్టును కోరలేదన్నారు. రిమాండ్ ఖైదీగా అనంతబాబుకు జైళ్లో రాచమర్యాదలు జరుగుతున్నాయనీ గుర్తు చేశారు. కాగా అయ్యన్న పాత్రుడి నివాసం కూల్చివేత విషయానికి వస్తే.. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి దాటిన తరువాత అధికారులు మందీ మార్బలంతో కూల్చివేతకు బుల్ డోజర్ తో సహా వచ్చారంటే.. ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఏ స్థాయి నుంచి వచ్చాయే తేలికగానే అర్ధమౌతుందని అంటున్నారు. నర్సీపట్నం వెళుతున్న తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయడాన్ని జగన్ పిరికి పంద చర్యగా అభివర్ణించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చివేత యత్నం జగన్ కక్ష సాధింపు చర్యే అన్న తమ వాదనే నిజమని కోర్టు తన వ్యాఖ్యలద్వారా రుజువు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను గర్హిస్తూ గట్టిగా గళం వినిపిస్తున్న తెలుగుదేశం బీసీ నేతలపై కేసులు, అరెస్టులు, ఇళ్లపై దాడులతో జగన్ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు వత్తాసు పలుకుతూ నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న ప్రతి అధికారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి ఆనక చిక్కుల్లో పడవద్దని అధికారులకు చంద్రబాబు హితవు పలికారు. అయ్యన్న చేసింది కబ్జా కాదని....ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల భూములు చెరబట్టడమే నిజమైన కబ్జా అని చంద్రబాబు అన్నారు. అయ్యన్న ఇంటిని కూల్చివేసేందుకు వందల మంది పోలీసులతో, ముగ్గురు ఐపిఎస్ లు, సమస్త రెవెన్యూ అధికారులను మోహరించడం జగన్ దిగజారుడు విధానాలకు పరాకాష్ఠగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభివర్ణించారు. టిడిపి సభలు విజయవంతం అవ్వడం, ప్రజలనుంచి కూడా తిరుగుబాటు మొదలవ్వడంతో తీవ్ర ఫ్రస్టేషన్ లో పడిన జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఉత్తరాంధ్రలో నాడు సబ్బంహరి, పల్లా శ్రీనివాస్ ఇళ్లపై, ఆస్తులపై ప్రభుత్వ చర్యల ముసుగులో దాడి చేయించిన జగన్...ఇప్పుడు అయ్యన్న ఇంటిపై దాడి చేశారని అన్నారు. ఈ దాడులు, కక్ష సాధింపు చర్యలకు టిడిపి నేతలు ఎవరూ భయపడరని చంద్రబాబు అన్నారు.
పాలన అంటే కక్ష సాధింపే అన్న చందంగా జగన్ హయాం కొనసాగుతోంది. తాజాగా ఆదివారం తెల్లవారు జామున తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి నివాసం కూల్చి వేతకు అధికారులు యత్నించడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఆ వేళలో అంత రాత్రి వేళ కూల్చివేతల అవసరమేమిటని కోర్టు ప్రశ్నించింది. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నిలదీశారు. అయ్యన్న పాత్రుడికి మద్దతుగా నర్సీపట్నం వెళుతున్న తెలుగుదేశం నాయకులను హౌస్ అరెస్టులు చేయడం జగన్ పిరికి తనానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. అక్రమ కూల్చివేతలే సరికాదంటుంటే.. ఆ కూల్చివేతలకు నిరసన తెలియజేడయానికి వెళుతున్న వారిని అరెస్టు చేయడమేమిటని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని వారు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/babu-cautions-officers-not-to-cross-rules-25-138034.html





