వాస్తు లోపమే చిరంజీవి కొంపముంచిందా?
Publish Date:Aug 21, 2014
.jpg)
Advertisement
సినిమాల్లో మెగాస్టార్‌గా వెలిగిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం మూగ స్టార్‌గా మారిపోవడానికి కారణమేమిటి? రాజకీయ పరిపక్వత లేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోవడం, అవినీతి ఆరోపణలురావడం... ఇవన్నీ ఒక ఎత్తయితే అంతకంటే పెద్ద బలమైన కారణం మరోటి వుందన్న అభిప్రాయాలు వినిపిన్నాయి.. అది... అది... మరేదో కాదు.. వాస్తు! ఎస్.. రాజకీయంగా చిరంజీవి కొంప మునిగిపోవడానికి వాస్తు కారణమని పరిశీలకులు అంటున్నారు. చిరంజీవి తన సొంత పార్టీని మూసేసిన తర్వాత రాజకీయం ఆయన పరువు సగం పోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎంపీ అయి, కేంద్ర మంత్రి కూడా అయిన తర్వాత ఆ పరువు పూర్తిగా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. చిరంజీవికి ఎవరైనా అభిమానులు అనేవాళ్ళు మిగిలి వుంటే వాళ్ళు బాధపడతారేమోగానీ, ప్రస్తుతం ఏదో రాజ్యసభ పదవి ఉన్నప్పటికీ, ఆయన రాజకీయంగా జీరో అయిపోయారు. భవిష్యత్తులో హీరో అవుతారన్న నమ్మకం ఆయనకయినా వుందో, లేదో!
ఇదిలా వుంటే, చిరంజీవి రాజకీయంగా పూర్తిగా దెబ్బయిపోవడానికి ఢిల్లీలో ఆయన అధికార నివాస గృహం వాస్తు అష్ట దరిద్రంగా వుండటమే కారణమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి దక్కిన తర్వాత చిరంజీవికి ఢిల్లీ అక్బర్ రోడ్డులో ఒక బంగ్లాని కేటాయించారు. చిరంజీవి ఎన్నికోట్లో ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెట్టి ఆ బంగ్లాకి రకరకాల హంగూ ఆర్భాటాలు చేయించారు. అత్యాధునిక లుక్కు తెచ్చారు. అయితే పైపై అలంకారాలే తప్ప ఆ ఇంటికి వాస్తు ఎంతమాత్రం బాగాలేదట. పాపం చిరంజీవి ఆ ఇంటికి మేకప్ అయితే వేయగలిగారుగానీ, ఇంటి లోపల వున్న జబ్బుకు మాత్రం మందు వేయలేకపోయారు. దాంతో వాస్తు ఆగ్రహం కారణంగా చిరంజీవి అప్పటి నుంచి రాజకీయంగా పూర్తిగా డౌన్ అయిపోయారని పరిశీలకులు అంటున్నారు.
సదరు ఇల్లు వాస్తు పరంగా చాలా గొప్పదన్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి నివాస భవనాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి కేటాయించారు. చిరంజీవి గారిని ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. అయితే చిరంజీవి మాత్రం తానింకా రాజ్యసభ సభ్యుడిగా వున్నాను కాబట్టి, పైగా తానెంతో ముచ్చటపడి అలంకారాలు చేయించాను కాబట్టి తన పదవీకాలం ముగిసేవరకూ ఆ ఇంటిని తనకే ఉంచాలని, లేకపోతే తనకు మరో బంగ్లా చూపించాలని రిక్వెస్ట్ చేశారు. మామూలుగా అయితే ప్రభుత్వం అలా కుదరదని చెప్పేసేదే. అయితే చిరంజీవి ప్రస్తుత నివాసానికి రావడానికి రాజ్‌నాథ్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఆ ఇల్లు వాస్తుపరంగా ఘోరంగా వుంటుంది కాబట్టి తాను ఆ ఇంటికి వెళ్ళలేనని, ప్రస్తుతం తాను నివాసం వుంటున్న ఇంట్లోనే వుంటానని రాజ్‌నాథ్ చెబుతున్నట్టు తెలుస్తోంది. దాంతో వాస్తుపరంగా అమోఘంగా వున్న ఆ ఇంటిలోనే చిరంజీవి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాపం చిరంజీవి!
http://www.teluguone.com/news/content/vastu-problem-to-chiranjeevi-new-delhi-house-45-37455.html












