మళ్ళీ ఎన్నికలు జరపాలా? పద్ధతేనా?
Publish Date:Jul 10, 2014
Advertisement
మొన్నీమధ్య దేశంలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన వ్యయం, ప్రలోభాలు, హింస, అధికార దుర్వినియోగం... ఇలాంటివన్నీ చూసి దేశ ప్రజలు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా విసిగిపోయి వున్నారు. మరో ఐదేళ్ళ వరకూ ఎన్నికల ఊసే లేకుండా వుండాలని కోరుకుంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్జెంటుగా ఎన్నికలు వస్తే బాగుందని అనుకుంటున్నారు. అది అసాధ్యమైన విషయమని తెలిసినా, ఆయన మనసులో మాత్రం మళ్ళీ ఎన్నికలు వస్తే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని అనుకుంటున్నారు. ఆయన మనసులో వున్న ఈ విషయం ఆయన మాటల్లో బయటపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుటికప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే ఇప్పుడు 67 అసెంబ్లీ స్థానాలు వున్న వైకాపా 167 స్థానాలకు ఎగబాకుతుందట. ఈమధ్య ఒక సందర్భంలో జగన్ నోట్లోంచి ఈ మాట వచ్చింది. అంటే, మరోసారి ఎన్నికలు పెడితే జగన్‌కి హ్యాపీయే అన్నమాట! అసలు మళ్ళీ ఎన్నికలు ఎందుకు పెట్టాలి? చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు కూడా కాకుండానే అంత కొంపలు మునిగిపోయే అంశాలు ఏం జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా వుండే పని ఒక్కటయినా చేసిందా? లేదే? మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రజలందరూ జగన్ ప్రదర్శించిన ఏ ప్రతిభను చూసి మురిసిపోయి 67 సీట్లున్న ఆయనకి 167 సీట్లు ఇస్తారు? అయినా వెంటనే ఎన్నికలు జరగాలన్న కుళ్ళు ఆలోచన వచ్చిన జగన్ని అసలు ఏమనాలి? ఎన్నికల రూపంలో ప్రజాధనం ఎంత వృధా అయిపోయినా పర్లేదు.. తనక మాత్రం అధికారం దక్కాలి. ఇదీ జగన్ మనసులో వున్న ఆలోచన. జగన్ కోరుకున్నట్టు నిజంగా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే జగన్ పార్టీకి ఇప్పుడున్న 67 స్థానాలకు బదులు 7 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని జగన్ గ్రహిస్తే మంచిదని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/andhra-pradesh-ysrcp-leader-jagan-45-35722.html





