జగన్ యాంటీ అమరావతి మైండ్ సెట్.. ఒరిగేదేంటంటే?
Publish Date:Jun 4, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం హాట్ టాపిక్‌గానే ఉంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత కూడా ఈ వివాదం చల్లారినట్లు కనిపించడం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రైతులతో ప్రత్యేకంగా సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కూటమి ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటోందని ఆరోపిస్తున్న కొందరు రైతులతో జగన్ భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సర్వత్రా సాగుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులంతా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ లైవ్ ప్రసారం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట. అయితే జగన్ ఈ వ్యూహాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఈ సమావేశానికి వచ్చిన రైతులు అమరావతి ప్రాంతంలో వైసీపీని సమర్థించే ఒక వర్గానికి చెందిన వారని, అక్కడ తీవ్ర అసంతృప్తి ఉందనే రంగు పులిమేందుకే ఈ భేటీని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ వ్యూహం సక్సెస్ అయ్యే అవకాశాలు మృగ్యమని విశ్లేషిస్తున్నారు. నిజానికి 2019 ఎన్నికల సమయంలో అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు జగన్ కి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. దానికి కారణం ఎన్నికల ముందు ఆయన అమరావతి రాజధానిగానే ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మాట మార్చి మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో రాజధాని ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ 2024 ఎన్నికలలో వైసీపీని తిరస్కరించారు. దీంతో ఆయన పార్టీ ఆ ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక జగన్ ఇప్పుడు కూడా అదే యాంటీ అమరావతి మైండ్‌సెట్‌తో ముందుకు సాగడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు వైసీపీ మరింత దూరం అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో అమరావతి రైతులు రాజధాని అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర ఉంది. అలాంటి ప్రాంతంలో మళ్లీ రాజధాని మార్పు అనడం ద్వారా జగన్ సాధించేది ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటం సెల్ఫ్ గోల్ అవుతుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-will-jagan-gain-with-anti-amarawathi-45-221750.html





