బీజేపీ నేత విష్ణుపై లైవ్ లో చెప్పు దాడి
Publish Date:Feb 23, 2021
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దారి తప్పుతున్నాయి. రాజకీయ నాయకులు దూకుడే ప్రధాన అయుధంగా మార్చుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలకు తెగబడుతున్నారు. దాడులకు కూడా వెనుకాడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంస్కృతి పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజకీయ నేతలు నోరు తెరిస్తే బండ బూతులే వస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు.. తిట్ల పోటీ పెట్టుకున్నట్లుగా.. విపక్ష నేతలపై అసభ్య పదాలను ఉపయోగిస్తున్నారు. ప్రజల ఛీదరించుకుంటున్నా తమ తీరు మార్చుకోవడం లేదు. లైవ్ డిబేట్లలోనూ ఘోరంగా తిట్టుకుంటున్నారు. గొడవలు పడుతున్నారు. వీక్షకలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేకుండా కొట్టుకునే వరకు వెళుతున్నారు. రాజకీయ నేతల దిగజారి పోయి వ్యవహరిస్తుండగా... తమ అసమ్మతి, నిరసనను తెలిపేందుకు ప్రత్యక్ష ప్రసారాలను కొందరు వేదికగా మార్చుకుంటున్నారు. తమ అభిప్రాయాన్ని, ఆగ్రహాన్ని చెప్పటానికి అస్త్రంగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. అమరావతిపై ఓ టీవీ ఛానెల్ ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. అమరావతిపై సీఎం జగన్ ఆలోచన మారిందా అన్నది అంశం. ఈ చర్చలో అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు, బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి పాల్గొన్నారు. అమరావతిపై సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయానికి సంబంధించి శ్రీనివాస్, విష్ణు మధ్య ఘాటుగా చర్చ జరిగింది. చివరకు అది వ్యక్తిగత దూషణ వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. అమరావతి జేఏసీ కన్వీనర్ ను పెయిడ్ అర్టిస్ట్ అని సంబోంధించారు విష్ణు. టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నావు.. టీడీపీ ఆఫీసులో పని చేసుకో అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అమరావతి జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు... తన కాలి చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డి ముఖంపైకి విసిరేశారు. ఇదంతా లైవ్ లో వచ్చింది. ఘటనతో చర్చలో పాల్గొంటున్న మిగితా నేతలతో పాటు లైవ్ షో చూస్తున్న జనాలు షాకయ్యారు. బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిని అమరావతి జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు చెప్పుతో కొట్టిన ఘటన ఏపీలో సంచలనంగా మారింది. అమరావతిపై అడ్డగోలుగా మాట్లాడినందువల్లే దాడి చేశారని కొందరు చెబుతుండగా.. లైవ్ డిబేట్ లో చెప్పుతో దాడి చేయడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/amaravathi-jac-leader-srinivas-rao-attack-on-bjp-leader-vishnu-verdhan-reddy-in-live-debate-25-110580.html





