అసెంబ్లీ ఎంత సేఫ్?
Publish Date:Feb 23, 2021
Advertisement
తెలంగాణ అసెంబ్లీ భవనం స్వల్పంగా కూలింది. తూర్పు వైపు ఉన్న ఎలివేషన్ పెద్ద శబ్దం చేస్తూ పడిపోయింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయ భవనం పైకప్పు గోపురం కూలి కిందపడింది. భవనం పెచ్చులు ఊడిపడటంతో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. శిధిలాలు గార్డెన్ ఏరియాలో పడటంతో ప్రమాదం తప్పింది. తెలంగాణ అసెంబ్లీ భవనం ఘటనపై శాసన సభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు స్పందించారు. ఏటా గోడలు, సీలింగ్ నుంచి సున్నం, గచ్చు పెచ్చులు జారడం సహజమన్నారు. అసెంబ్లీ ఇంజనీరింగ్ విభాగం ఆయా ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపడతూ ఉందన్నారు. ప్రధాన స్ట్రక్చర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవని, పటిష్టంగా ఉందని చెప్పారు. అధికారులు, ఇంజనీరింగ్ విభాగం నిత్యం శాసనసభ భవనంతో పాటుగా అనుబంధ కార్యాలయాలు ఉన్న భవనాలను పరిశిలిస్తున్నారని.. ఎనీ టైమ్ అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన మేరకు మరమ్మతులు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీకి వందేళ్ల చరిత్ర. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ కాలంలో 1905లో పనులు ప్రారంభమై.. 1913 డిసెంబర్ లో భవన నిర్మాణం పూర్తయింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో భవనం అందుబాటులోకి వచ్చింది. మొదట్లో దీన్ని ‘మహబూబియా టౌన్‌హాల్’గా పిలిచేవారు. తర్వాతి కాలంలో ఇది అసెంబ్లీ అయ్యింది. ప్రజల చందాలతో ఈ భవనాన్ని నిర్మించడం విశేషం. అసెంబ్లీ భవనం పాత బడటంతో కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ చేపట్టింది. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో కొత్త అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు. గతేడాది సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. అయితే కోర్టు చిక్కులతో అది ఆగిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ భవనంలోని ఎలివేషన్ శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో భవనం భద్రత ప్రశ్నార్దకంగా మారింది.
http://www.teluguone.com/news/content/telangana-assembly-building-elivation-part-collapsed-25-110574.html





