అక్కడ హస్తం.. ఇక్కడ కమలం స్వీప్
Publish Date:Feb 23, 2021
Advertisement
ఉద్యమాలు జరుగుతుంటాయి,ఎన్నికలు వచ్చి పోతుంటాయి,దేని దారి దానిదే.ఒకదానికొకటి సమాంతరంగా సాగిపోతుంటాయి. మొన్నటి పంజాబ్,నిన్నటి గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అదే చెపుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగతున్న సమయంలోనే పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. పంజాబ్’లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరేసింది. విజయ దుందుభి మోగించింది. ఏడింట ఆరు మున్సిపల్ కార్పొరేషన్లను హస్తం పార్టీ ఎగరేసుకు పోయింది. ఏడవ కార్పొరేషన్’లో సింగల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే నిండా నెల రోజులు తిరగకుండానే, గుజరాత్’లో ఇంచుమించుగా అదే సంఖ్యలో, అదే మున్సిపల్ కార్పొరేషన్’కు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ, శేషం అనేది లేకుండా, సంపూర్ణంగా మొత్తం ఆరు కార్పొరేషన్లను, శుభ్రంగా స్వీప్ చేసింది. అంతేకాదు, పంజాబ్’లో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించిందో, గుజరాత్’లో కమలం అంతకంటే ఘనంగానే విరబూసింది. వడోదరాలో 76 కు 69, రాజ్కోట్లో 72 కు 68, జామ్ నగర్లో 64 కు 50, భావనగర్’లో 52 కు 44 గెలుచుకుంది. సూరత్’, అహ్మదాబాద్’లో కూడా కమల దళం మూడింట రెండు వంతుల మెజారిటీ గీత దాటేసింది. నిజానికి, బీజేపీ ఈ ఆరు కార్పొరేషన్లలో దశాబ్దానికి పైగా పాతుకు పోయింది. కొత్తగా గెలిచింది ఏదీ లేదు. అయితే, మొత్తం కార్పొరేషన్ స్థానాల్లో 80 శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవడం విశేషం. అలాగే, కాంగ్రెస్ పార్టీకి ఆరు ప్రధాన నగరాల్లోనూ అడ్రస్ గల్లంతైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు అనుకున్న అహ్మదాబాద్ లోని జమల్పూర్, మక్తంపూర్ వార్డులు సహా మొత్తం 7 వార్డులో ఎంఐఎం విజయం సాధించి, గుజరాత్’లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే, గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన ఆమ్ఆద్మీ పార్టీ సూరత్’లో అనూహ్యంగా 27 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్’ ను తుడిచేసింది. సో ... ఈ ఫలితాలను కొంచెం లోతుగా విశ్లేషించుకుంటే, ఎన్నికల ఫలితాలను ఉద్యమాలు కొంత వరకు ప్రభావితం చేస్తే చేస్తాయి, కానీ, దేశ రాజకీయ ముఖ చిత్రాన్నేమార్చివేసే శక్తి సామర్ధ్యాలు అన్ని ఉద్యమాలకు ఉండవు.పంజాబ్, గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మరోసారి అదే నిరూపించాయి ..దట్సాల్.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపేకి ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ దక్కకలేదు.మరోవంక ఒక్క ‘మోగా’ మున్సిపల్ కార్పొరేషన్ మినహా, మిగిలిన అన్ని కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. చివరకు, 53 ఏళ్లలో ఎప్పుడు గెలవని ‘బటాల’ మున్సిపల్ కార్పొరేషన్’లోనూ జనం హస్తానికి జై కొట్టారు. 53 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం సొంతం చేసుకుంది.
ఈ ఘన విజయం,రైతుల ఆందోళన పుణ్యమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పని కూడా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అలాగే, బీజేపీ వ్యతిరేకత విషయంలో కొంచెం అధిక ఉత్సాహాన్ని చూపే వామపక్ష పార్టీలు, మేథావులు, మహా మేథావులు అంతం కాదిది ఆరంభం మాత్రమే, ఇక బీజేపీ కథ ముగిసినట్లేనని సంబురాలు చేసుకున్నారు.
http://www.teluguone.com/news/content/punjab-cong-gujarat-bjp-win-in-minicipal-election-25-110583.html





