ఆదిశంకరాచార్యులు శుద్ధ వైష్ణవులా?... చినజీయర్ స్వామి కామెంట్స్ దుమారం

Publish Date:Feb 9, 2026

Advertisement

 

జగద్గురు ఆదిశంకరాచార్యులపై చిన్నజీయర్ స్వామి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఆదిశంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడని, దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారాయ్. అద్వైత స్థాపకులు, జగద్గురువు ఆదిశంకరాచార్యులపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు పీఠాధిపతుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. దేశం నలుమూలలా ఉన్న పూరీ, ద్వారక జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను స్థాపించింది ఆదిశంకరాచార్యులు కాదని చిన్నజీయర్ పేర్కొన్నారు. 32 ఏళ్లకే హిమాలయాలకు వెళ్లి అదృశ్యమైన శంకరాచార్యులు.. ఈ మఠాలను ఏర్పాటు చేశారనడం సరికాదని చెప్పడం చర్చనీయాంశమైంది.  

సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో జరుగుతున్న సమతాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో.. చిన్నజీయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యులు విష్ణువును మాత్రమే దైవంగా నమ్మారని, ఆయన రాసిన స్తోత్రాలు, భాష్యాలు విష్ణు భక్తినే చాటుతాయనేది ఆయన వాదన. చతురామ్నాయ పీఠాలను.. ఆదిశంకరాచర్యులు స్వయంగా స్థాపించలేదని, తర్వాతి కాలంలో అవి ఏర్పడ్డాయని తెలిపారు.  జగద్గురువు ఉనికినే ప్రశ్నించేలా ఉన్న ఈ వ్యాఖ్యలు.. భక్తుల మధ్య విభేదాలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై.. శైవ పీఠాధిపతులు, స్మార్త బ్రాహ్మణ సంఘాలు, ఆధ్యాత్మిక గురువులు తీవ్రంగా స్పందిస్తున్నారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఒక్క మాటతో తేల్చేయడం తగదని పండితులు వాదిస్తున్నారు. హిందూ సమాజం మొత్తం ఏకమవుతున్న తరుణంలో.. వైష్ణవులు, శైవుల మధ్య తగాదా పెట్టడమేంటని.. శివ పీఠాధిపతి శివస్వామి ప్రశ్నించారు. చిన్నజీయర్ స్వామి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  

శ్రీనివాసానంద సరస్వతి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. చినజీయర్ స్వామి లాంటి వారు అవాస్తవాలు మాట్లాడటం ధర్మానికి మంచిది కాదని, తక్షణమే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.  శంకరాచార్యులవారు పంచాయతనాన్ని ఆరాధన చేయలేదని, ఆయన నారాయణ పరాయణుడని చిన్నజీయర్ స్వామి చెప్పడంపైనా చర్చ మొదలైంది. ఆదిశంకరాచార్యులవారి తత్వం అద్వైత తత్వమే కానీ.. ఆయన ఉత్తమ వైష్ణవుడని చెప్పడంపై వివాదం నడుస్తోంది. మన దేశాన్ని విదేశీయులు ఆక్రమిస్తున్న క్రమంలో.. వారిని ఎదుర్కొనేందుకు అంతా కలిసుంటే బాగుంటుందనే ఆలోచనతో.. విద్యారణ్యస్వామి వివిధ భక్తి మార్గాల్లో ఉండేవాళ్లందరినీ కలిపేందుకు.. పంచాయతనాన్ని పరిచయం చేశారని చిన్నజీయర్ స్వామి చెప్పారు. 

అయితే.. 13వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారని చినజీయర్‌ చెబుతున్నా.. నాలుగు పీఠాల్లో ఒకటైన శృంగేరి పీఠానికే విద్యారణ్య స్వామి 12వ గురువంటున్నారు. ఆయన 1380 నుంచి 1386 దాకా శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు. ఆయనకన్నా ముందు.. విద్యారణ్యుల వారి సోదరుడు భారతీ తీర్థ, 1333 నుంచి 1380 దాకా 11వ పీఠాధిపతిగా ఉన్నారు. అలాంటిది.. చతురామ్నాయ పీఠాలను విద్యారణ్య స్వామి ఏర్పాటు చేయడమేమిటంటూ చిన్నజీయర్ స్వామిపై భక్తులు విమర్శలు చేస్తున్నారు.


ఆదిశంకరాచార్యులు మతాలను సంస్కరించి, విగ్రహారాధనలోని గందరగోళాన్ని తొలగించి.. అందరికీ ఒకేతాటిపైకి తెచ్చారంటున్నారు. చిన్నజీయర్ చెప్పినట్లు ఆయన కేవలం వైష్ణవుడే అయితే.. శివునిపై శివానందలహరి, అమ్మవారిపై సౌందర్యలహరి లాంటి అద్భుత గ్రంథాలు ఎందుకు రాస్తారని పండితులు ప్రశ్నిస్తున్నారు. వేల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలు, ఆయా పీఠాల గురు పరంపర ప్రకారం.. ఆదిశంకరాచార్యులు.. దేశంలోని నాలుగు దిక్కులా ధర్మాన్ని రక్షించేందుకు.. తన నలుగురు శిష్యులను పీఠాధిపతులుగా నియమించారని తెలుస్తోంది. ఇదంతా.. అద్వైతానికి, విశిష్టాద్వైతానికి మధ్య ఉన్న ప్రాచీన భేదమని, వివాదంగా మార్చడం వల్ల.. హిందూ ధర్మంలో చీలికలు వస్తాయన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
ప్రేమకు అసలు సిసలు నిర్వచనం చెప్పారు జంట.
ఐపీఎల్ నుంచి ధోనీ తప్పుకుంటున్నారా? ఆఖరి మ్యాచ్‌పై వీడని ఉత్కంఠ!
శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఈసారి పూర్తిగా సాధారణ ట్రాఫిక్ మధ్యనే ప్రయాణించడం నగరంలో ప్రత్యేక చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్‌ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.