బాలిక కిడ్నాప్,అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
Publish Date:Mar 4, 2026
Advertisement
దుండిగల్లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాలికను బెదిరించి కిడ్నాప్ చేసి, ముంబైకు తీసుకెళ్లి ఆరు నెలల పాటు నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేసినట్టు నిర్ధారణ కావడం తో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. అదనంగా బాధితురాలికి రూ.5 వేలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కేసు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాకు చెందిన షేక్ నసీర్ అలియాస్ అహ్మద్ (35) అనే వ్యక్తి దుండిగల్‌లో నివాసముంటూ 2021 అక్టోబర్ 29న ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను బెదిరించి కిడ్నాప్ చేశారు. మరుసటి రోజు బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. అనంతరం దర్యాప్తులో నిందితుడు బాలికను ముంబైకు తరలించి ఒక గదిలో నిర్బంధించి ఆరు నెలల పాటు లైంగిక దాడులకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికలు, సాంకేతిక ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. పోక్సో చట్టం సెక్షన్ కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించింది. అదే విధంగా అపహరణకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 363 కింద ఐదు ఏళ్ల కఠిన కారాగార శిక్ష, అక్రమ నిర్బంధానికి సంబంధించిన సెక్షన్ 344 కింద మూడు ఏళ్ల కఠిన కారాగార శిక్ష, బెదిరింపులకు సంబంధిం చిన సెక్షన్ 506 కింద ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షలను కూడా ఖరారు చేసింది. ఆయా సెక్షన్ల కింద జరిమానాలను కూడా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
http://www.teluguone.com/news/content/accused-gets-20-years-in-prison-in-minor-kidnapping-and-rape-case-36-214981.html





