యుద్ధం వస్తుందా .. వస్తే ఏమవుతుంది?
Publish Date:Apr 25, 2025
Advertisement
సర్వత్రా ఇదే ఉత్కంఠ! పహల్గాం ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల తరువాత ప్రధానమంత్రి (గురువారం (ఏప్రిల్ 24) తొలిసారిగా స్పందించారు. ఉగ్రదాడి నేపధ్యంలో విదేశీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని బుధవారమే(ఏప్రిల్23) స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోడీ గురువారం (ఏప్రిల్ 24) వరకూ వ్యూహాత్మక మౌనం పాటించారు. మరో వంక కాగల కార్యం, కానిచ్చేవారు కానిచ్చారు. అయితే మోదీ మళ్ళీ మరో మెరుపు దాడి చేశారు కానీ.. పాకిస్తాన్, పాక్ ప్రేమికులు ఆశించిన విధంగా కాదు.. అనూహ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్ పై వ్యూహాత్మక మెరుపు దాడి చేశారు. ఇంతవరకు దాయాది దేశాల మధ్య యుద్దాలు జరిగాయి, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పతాక స్థాయికి తీసుకు పోయింది. మన దేశంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాద సంస్థలకు ప్రత్యక్ష పరోక్ష సహకారం అందించింది, అయితే.. ఉభయ దేశాల మధ్య వైషమ్యాలు పతాక స్థాయికి చేరినా, మానవతా దృక్పథంతో, మంచితనంతో మన దేశం పాకిస్తాన్ కు జీవాధారం అయిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకోలేదు. కానీ హద్దులు దాటిన పాక్ పాపాలకు చుక్క పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఇక ఉపేక్షించి లాభం లేదని నిర్ణయానికి వచ్చింది. కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇంతటితో అయిపోయిందా, పహల్గాం ఉగ్రదాడిని ఇక్కడితో మరిచి పోవడమేనా? అంటే, లేదు అసలు ‘యుద్ధం’ ఇప్పుడే మొదలైందని విశ్లేషకులు అంటున్నారు. అవును.. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇంచుమించుగా 48 గంటలకు పైగా వ్యూహాత్మక మౌనం పాటించిన ప్రధాని మోదీ గురువారం (ఏప్రిల్24) బీహార్లోని మధుబనిలో జరిగిన పంచాయతీ రాజ్ కార్యక్రమంలో తొలిసారిగా పహల్గామ్ ఉగ్రదాడి పై బహిరంగంగా స్పందించారు. నిజానికి ప్రధాని మోదీ స్పందించారు,అనే కంటే దేశ ప్రజల గుండె మంటలను ఆవిష్కరించే విధంగా నిప్పులు చెరిగారు. గర్జించారు అనడం సమంజసంగా ఉంటుంది. 140 కోట్ల మంది గుండె మంటలను ప్రధాని మోదీ తన గొంతుకలో వినిపించారు. అవును.. జమ్మూ కశ్మీర్లో అమాయకుల ప్రాణాలు హరించిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా, వెతికి, వెంటాడి, వేటాడి శిక్షిస్తామని హెచ్చరించారు. హంతక ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. అంతే కాదు.. ఉగ్రవాద మూకలకు మద్దతి స్తున్న వారిని కూడా వదిలేది లేదని, కలలో కూడా ఉహించలేని విధంగా కఠినంగా శిక్షిస్తామని, ప్రపంచం అంతటికీ వినిపించేలా ప్రపంచ భాష ఇంగ్లీష్ లోనూ చెప్పారు. ఈ రోజు, బీహార్ గడ్డపై.. నేను ప్రపంచం మొత్తానికి చెబుతున్నాను, భారతదేశం ప్రతి ఉగ్రవాదిని శిక్షిస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న, కుట్రలో భాగమైన ప్రతి ఒకరినీ వారి ఊహకు కూడా అందని విధంగా కఠినంగా శిక్షిస్తాం. ఇప్పుడు.. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చేందుకు మిగిలి ఉన్న ఆ కొద్ది భూభాగాన్ని మట్టి కరిపిస్తాం. మొత్తం దేశం ఈ సంకల్పంలో దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనతో ఉన్నారు అని ప్రధానమంత్రి అన్నారు. అయితే.. ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మాటలు ఎంత వరకు కార్యరూపం దలుస్తాయి? ప్రభుతం ఎందాకా పోతుంది? ఉభయ దేశాల మధ్య మరో యుద్ధానికి దారి తీస్తుందా? అన్నది ఇప్పుడు దేశం ముందున్నప్రశ్న. నిజానికి, దేశం ముందు కాదు, ప్రపంచం ముందున్న ప్రశ్న కూడా ఇదే.. అలాగే.. యుద్దమే వస్తే ఏమవుతుంది? అనేది కూడా ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ..
విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తూనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా అనూహ్యమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా, 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటుగా అట్టారి భూ-రవాణా పోస్టును వెంటనే మూసివేయడం వంటి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఒక విధంగా ఇది, అటు పాకిస్తాన్ కు ఇటు దేశంలోని పాక్ అనుకూల శక్తులకు కూడా మింగుడు పడ లేదు. నిజానికి, పాకిస్తాన్ సైన్యం, మోదీ మరో మెరుపు దాడి చేస్తారని ఉహించి ఎదుర్కునేందుకు సన్నద్దమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో వైమానిక దళాలను, సైన్యాన్నిమోహరించింది.
http://www.teluguone.com/news/content/-the-question-on-everyones-mindwii-is-war-break-out-39-196892.html





