మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు మాధవరెడ్డి అరెస్టు.. పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిసిందా?
Publish Date:Apr 25, 2025
Advertisement
మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం సంఘటనలో కుట్ర అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాధవరెడ్డి గత ఆరు నెలలుగా కోర్టు నుంచి ముందస్తు బెయిలు పొంది అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. అయితే సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించి ఆ యాంటిసిపేటరీ బెయిలు రద్దు అయ్యేలా చేశారు. మాధవరెడ్డికి యాంటిసిపేటరీ బెయిలు రద్దు కావడంతో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని పెద్దగొట్టిగల్లోలోని ఒక ఫామ్ హౌస్ లో మాధవరెడ్డి ఉన్నట్లుగా అందిన పక్కా సమాచారం మేరకు సిట్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. అరెస్టు సమయంలో మాధవరెడ్డి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను నీటిలో పడేసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డిని అదుపులోనికి తీసుకుని తిరుపతికి తరలించారు. మాధవరెడ్డి అరెస్టుతో ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు. జగన్ హయాంలో వైసీపీ నేతల అక్రమ సంపాదన, భూకబ్జాల వ్యవహారం అడ్డూ అదుపూలేకుండా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలా అడ్డూ అదుపూ లేకుండా భూకజ్జాలకు పాల్పడిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందువరుసలో ఉన్నారని అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఒక్కొక్కరూ భయంతో వణుకుతున్నారు. పోలీసు కేసులకు భయపడి సాక్ష్యాలను తారుమారు చేయడానికి పెద్దరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తన భూ ఆక్రమణలకు సంబంధించిన సాక్ష్యాలను గల్లంతు చేయడం కోసమే మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాల యంలో అగ్నిప్రమాద కుట్రకు తెరలేపారన్న అనుమానాలు ఉన్నాయి. ప్రాథమిక విచారణలో పైళ్ల దగ్దం ప్రమాదశాత్తూ జరగలేదని, ఎవరో కావాలనే నిప్పు పెట్టారని తేలింది. ఆ ఫైళ్లకు నిప్పుపెట్టి కాలిపోయేలా చేసింది పెద్దిరెడ్డి అనుచరులే అని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉందన్నది వెల్లడైంది. దీంతో ఈ కేసు దర్యాప్తునకు ప్రభు త్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కేసులోనే పెద్దరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అరెస్టయ్యారు. దీంతో తరువాతి వంతు పెద్దిరెడ్డిదేనా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/gormer-minister-peddireddy-ramachandrareddy-clode-aid-madhavareddy-arrest-39-196888.html





