పీవోకేలో పాక్ బలగాల మారణ కాండ.!
Publish Date:Jul 29, 2026
Advertisement
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లో రక్తం ఏరులై పారుతోంది. ప్రాథమిక హక్కుల కోసం, రాజకీయ అధికారంలో ప్రాంతీయ భాగస్వామ్యం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరాయుధ ప్రజలపై పాకిస్థాన్ బలగాలు తుపాకులతో విరుచుకుపడుతున్నాయి. పాక్ బలగాల కాల్పులలో రెండు రోజుల వ్యవధిలోనే 40 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. హక్కుల హననానికి తోడు పీవోకేలో గళమెత్తుతున్న ప్రజలపై పాక్ బలగాలు పాశవిక అణచివేతకు పాల్పడుతున్నారు. గత రెండు రోజులుగా రావల్‌కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన దాడులు, కాల్పుల్లో 40 మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. పీవోకేలో జనం ప్రాథమిక హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన శాంతియుత నిరసనలపై పాక్ సైన్యం యుద్ధం ప్రకటించింది. పాక్ రక్షణ మంత్రి పీవోకేలో ఆందోళనలు చేస్తున్న వారు పాక్ కు శత్రువులు అని ప్రకటించి.. ఆ ఆందోళనల అణచివేతకు సైన్యాన్ని ప్రయోగించారు. పాక్ బలగాల దాడులు, కాల్పులతో పీవోకే రక్తమోడుతోంది. పీవోకేలో పాక్ బలగాల దమన కాండను యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గత నెల 5 నుంచి ఈ నెల 28 వరకూ పీవోకేలో పాక్ బలగాల దమనకాండకు తక్కువలో తక్కువ వంది మంది మరణించారు. పాక్ బలగాల పైశాచికత్వాన్ని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఖండించింది. ఇది నిరాయుధులపై పాక్ ప్రభుత్వం చేస్తున్న యుద్ధమని విమర్శించింది. హక్కులను కోరడమే పీవోకే ప్రజలు చేసిన నేరమా అని ప్రశ్నించింది. పాక్ ప్రభుత్వం తన సొంత పౌరులపైనే సైనిక చర్యలకు పాల్పడుతోందని, ఇది మానవత్వానికే మచ్చ అని మండి పడింది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్, మీర్పూర్ సహా పలు సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాస్తవాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు, వార్తలు అంతర్జాతీయ మీడియాకు చేరకుండా చేసేందుకు పాక్ ప్రభుత్వం అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థలను పూర్తిగా నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్ కావడం వల్ల అక్కడి ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. PoK violence, Pakistan army firing, Rawalakot curfew, United Kashmir Peoples National Party, PoK crisis
http://www.teluguone.com/news/content/-pakistani-forces-massacre--in-pok-36-227465.html





