ఏపీలో చురుకుగా కదులుతున్న రుతుపవనాలు
Publish Date:Jun 11, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలను తాకిన నైరుతి రుతుపవనాలు, ఇప్పుడు ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి. రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు తోడు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, అలాగే.. తెలంగాణ నుంచి దక్షిణ కోస్తా వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం (జూన్ 12) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు పలు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇప్పటికే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
http://www.teluguone.com/news/content/-monsoon-actively-advancing-in-ap-36-222652.html





