పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్
Publish Date:Jun 23, 2026
Advertisement
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా.. సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్‌తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. కళారంగంలో విశేష సేవలు అందించిన టాలీవుడ్ సీనియర్ నటులు 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్, ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరిద్దరూ ఈ అత్యున్నత పౌర పురస్కారాలను స్వీకరించారు.. అలాగే, వీరితో పాటు సినీనటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ అట్టహాసమైన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, దేశవ్యాప్త ప్రముఖులు విచ్చేశారు. వివిధ రంగాలలో సమాజానికి అసమాన సేవలు అందించిన మొత్తం 47 మంది వీరులకు ఈ విడతలో పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో తెలుగు చిత్రసీమకు చెందిన ఇద్దరు అగ్ర నటులు ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు, సినీ అభిమానులకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించి, తనదైన హాస్య చతురతతో, వైవిధ్యమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన రాజేంద్రప్రసాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో గౌరవించింది. ఆయన పద్మశ్రీ పురస్కారం స్వీకరిస్తున్న సమయంలో రాష్ట్రపతి భవన్ సభామండపం చప్పట్లతో మారుమోగింది. తెలుగు తెరపై హాస్యానికి సరికొత్త అర్థం చెప్పిన నటుడిగా ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మరోవైపు నటుడిగా, జయభేరి బ్యానర్‌పై ఎన్నో సందేశాత్మక చిత్రాలను నిర్మించిన నిర్మాతగా, అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడిగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మురళీమోహన్‌కు సైతం పద్మశ్రీ దక్కింది. సమాజ సేవలోనూ, వ్యాపార రంగంలోనూ రాణిస్తూనే తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఆయనకు ఈ పురస్కారం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పురస్కారాల పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ వంటి సీనియర్లకు ఈ గౌరవం దక్కడం చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభ పరిణామమని, ఇది టాలీవుడ్ ప్రతిష్టను జాతీయ స్థాయిలో మరింత పెంచిందని పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా రంగం నుంచి మరింత మంది అర్హులైన ప్రతిభావంతులకు రాబోయే రోజుల్లోనూ ఇటువంటి జాతీయ గౌరవాలు దక్కాలని తెలుగు ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు. నటనలోనే కాకుండా సమాజ హితం కోసం పాటుపడే కళాకారులకు ఈ అవార్డులు మరింత స్ఫూర్తినిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/rajendra-prasad-padma-shri-36-223939.html





