రిటైర్డ్ ఉద్యోగులకు షాక్... ఈపీఎఫ్‌ఓ పెన్షన్ విధానంలో కీలక మార్పులు
Publish Date:Apr 25, 2026
Advertisement
భారతదేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు అత్యంత కీలమైన పెన్షన్ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న అధిక పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయంగా, ఈపీఎఫ్‌ఓ సరికొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో ఉద్యోగులు పొందే పెన్షన్ ప్రయోజనాల్లో గణనీయమైన కోత పడే అవకాశం ఉందని సమాచారం. ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలు 2014, సెప్టెంబరు 1 నుంచి లేదా ప్రభుత్వం నిర్ణయించే తేదీ నుంచి అమలులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు వచ్చిన సమాధానంతో ఈ నూతన పెన్షన్ ప్రతిపాదనల గురించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం లభిస్తున్న పెన్షన్ ప్రయోజనాలకు ఈ కొత్త విధానం ద్వారా కత్తెర పడనుంది. 2024 డిసెంబరులో ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్, ఈ ప్రతిపాదనలను కేంద్ర కార్మిక శాఖ మంత్రికి సమర్పించింది. ఇప్పటికే కార్మిక శాఖ నుండి ఆమోదం పొందిన ఈ విధానం, ప్రో-రేటా పద్ధతిలో పెన్షన్ లెక్కింపును ప్రధానంగా ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే, ప్రస్తుతం అధిక పెన్షన్లు పొందుతున్న వారికి చెల్లింపుల్లో భారీగా తగ్గుదల ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల్లో అధిక వేతనం తీసుకునే ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పీఎఫ్ ట్రస్టుల నుండి వచ్చే పెన్షన్ దరఖాస్తులను తిరస్కరించడం కూడా ఈ కొత్త నిబంధనల్లో భాగమే. మరోవైపు, కనీస పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 1,000 నుండి రూ. 3,000కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో పాటు కేంద్రం అదనపు వాటాను వినియోగించనుంది. అయితే, వేతనంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పెన్షన్ ఫండ్‌లో చేరడం తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందుతున్నాయి. ఈ ప్రతిపాదనలపై కార్మిక సంఘాలు మరియు ఉద్యోగ వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై స్పష్టత వచ్చే వరకు ఆందోళన చెందవద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/-epfo-36-218237.html





