రైతుల ఆత్మహత్యలపై కూడా ద్వంద వైఖరేనా?

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి తెదేపా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా రాష్ట్రంలో నానాటికీ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా కూడా వాటి గురించి ఎన్నడూ పెదవి విప్పి మాట్లాడకపోవడం గమానార్హం. ఈ అంశంపై తెలంగాణాలో అన్ని ప్రతిపక్ష పార్టీలు తెరాస ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి కానీ వైకాపా మాత్రం మాట్లాడటం లేదు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అందుకు అనుమతించ లేదనుకోవలసి ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి మరణానికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొన్నవారిని పరామర్శించడం కోసం షర్మిల ప్రస్తుతం తెలంగాణాలోనే పరామర్శ యాత్రలు చేస్తున్నారు. ఆమె యాత్రలు కూడా వారి వరకే పరిమితం చేస్తున్నారు తప్ప రైతన్నల ఆత్మహత్యల గురించి ఆమె కూడా పల్లెత్తు మాట మాట్లాడకపోవడం గమనార్హం.

 

బహుశః వైకాపా-తెరాసల మధ్య రహస్య స్నేహం కొనసాగుతున్నందున, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడితే తెలంగాణా ప్రభుత్వానికి మరింత ఇబ్బందికర పరిస్థితులు కల్పించినట్లవుతుందనే ఆలోచనతోనే వైకాపా నేతలు ఆ విషయం గురించి మాట్లాడటం లేదని అనుమానించవలసి వస్తోంది. కానీ ఆంధ్రాలో తన రాజకీయ విరోధి అయిన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో వరి, పొగాకు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందిస్తుంటారు. అంటే ఆయన కేవలం రాజకీయ కారణాలతోనే తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు తప్ప రైతుల దీనస్థితిని చూసి కాదని స్పష్టమవుతోంది.

 

ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న ఇద్దరు రైతుల కుటుంబాలను  ఓదార్చడానికి జగన్ బయలుదేరుతున్నారు. వారిని ఓదార్చిన తరువాత పొగాకు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రేపు టంగుటూరులో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయబోతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu