జగన్ సారూ... ఇప్పుడేమంటారూ?
posted on Dec 17, 2015 12:38PM

గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తామని వైసీపీ నాయకులు కన్న కలలు కల్లలు కావడం... భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు శూన్యంగా కనిపిస్తూ వుండటంతో వైసీపీ నాయకులలో అసహనం పెరిగిపోయి అప్పుడప్పుడు అదుపుతప్పి ప్రవర్తించడం జరుగుతోందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతూ వుంటాయి. అందువల్ల కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు గొడవలకు దిగుతూ వుంటారని అంటూ వుంటారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. ఎంపీలు కూడా అసహనంతో వున్నారన్న విషయాన్ని ఆమధ్య వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిరూపించారు. నవంబర్ 26వ తేదీన రేణిగుంట విమానాశ్రయంలో విమానాశ్రయ ఉద్యోగి మీద ఆయన చేయి చేసుకుని వీరంగం సృష్టించారు. ఆయనకు సపోర్టుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా సదరు ఉద్యోగిని వీరబాదుడు బాదారు. అయితే ఈ విషయంలో జగన్ తన పార్టీ నాయకులను మందలిస్తే బావుండేది. అయితే ఆయన వారికి మద్దతుగా నిలిచారు. వాళ్ళు చాలా అమాయకులని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన పార్టీ నాయకులను లేనిపోని గొడవల్లో, కేసులలో ఇరికిస్తూ తమ పార్టీ ప్రతిష్ఠను తీసే ప్రయత్నాలు చేస్తోందని బాధపడిపోయారు. తన పార్టీ నాయకులు ఎవర్నీ కొట్టలేదని చెప్పుకొచ్చారు.
అయితే నిజం నిలకడమీద తేలుతుంది. అంటారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా నిజం నిలకడమీద తేలింది. రేణిగుంట విమానాశ్రయంలో జరిగిన ఆ గొడవ తాలూకు సీసీటీవీ ఫుటేజ్ బయటి ప్రపంచానికి వెల్లడి అయింది. ఒక జాతీయ న్యూస్ ఛానల్ ఆ ఫుటేజ్‌ను సంపాదించి ప్రసారం చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి,వారి అనుచరులు ఎయిర్‌పోర్ట్ మేనేజర్ రాజశేఖర్‌పై దాడి చేయటం, పిడిగుద్దులతో ఆయనను కొట్టడం సదరు ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ మొన్నటి వరకూ తన పార్టీ నాయకులు ఎయిర్ పోర్టు ఉద్యోగిని కొట్టిన ఫుటేజ్ వుంటే బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడికి సవాళ్ళు విసిరారు. ఆ ఫుటేజ్‌లో తన పార్టీ నాయకులు మేనేజర్‌ను కొట్టి ఉంటే మిథున్‌రెడ్డితో రాజీనామా చేయిస్తానని,లేకపోతే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ ఫుటేజ్ బయటపడింది. దాంట్లో వైసీపీ నాయకుల నిర్వాకం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు జగన్ గారు ఏమంటారో!