కాల్‌మనీ కథలు-2 - కాల్‌మనీ వెనుక ‘కాలామనీ’!
posted on Dec 17, 2015 1:04PM

కాల్‌మనీ... ఒక్కో వ్యక్తి వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్వహిస్తు్న్న ఘరానా వడ్డీ వ్యాపారం. పది రూపాయల ‘ధర్మవడ్డీ’తో నిర్దాక్షిణ్యంగా నిర్వహిస్తున్న వ్యాపారం. డబ్బు అవసరం వున్నవారి బలహీనతను ‘క్యాష్’ చేసుకోవడానికి బడాబాబులు ఎంచుకున్న ఒక మార్గం. వడ్డీతో ఆగకుండా అసలుకూ ఎసరు పెట్టే బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి ఈ వ్యాపారాన్ని బూతు స్థాయికి దిగజార్చిన ఘనులు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. మొన్నటి వరకు రూపాయికి కూడా ఠికానా లేని విజయవాడ కాల్‌మనీ వ్యాపార ప్రముఖులు ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. నిన్నమొన్నటి వరకు కనకదుర్గ గుడిలో చెప్పుల స్టాండ్ నిర్వహించుకుంటూ, బంతిపూలు అమ్ముకుంటూ పొట్టపోసుకున్న వ్యక్తి ఇప్పుడు కాల్‌మనీ వ్యాపారాన్ని నిర్వహిస్తూ కోట్లకు పగడలెత్తాడు. అక్కడితో ఆగాడా... ప్రజా ప్రతినిధి కూడా అయిపోయాడు. మరి కాల్‌మనీ వ్యాపారంలో ముదిరిపోయిన ఇలాంటి వాళ్ళకి వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి?
కాల్‌మనీ వ్యాపారంలో వినియోగిస్తున్న డబ్బంతా బ్లాక్ మనీనే. లెక్కాపత్రం లేని డబ్బే. సీమాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణాజిల్లా పరిసరాల్లో బడాబాబుల దగ్గర డబ్బుకు లోటు లేదు. అయితే ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి సరైన అవకాశాలే లేవు. బ్యాంకులో వేస్తే సవాలక్ష లెక్కలు చెప్పాలి. బ్యాంకు వాళ్ళు ఇచ్చే వడ్డీ చూస్తే విరక్తి కలుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సరైన అవకాశాలు చాలా తక్కువ. అందుకే చాలామంది డబ్బున్నవాళ్ళు కాల్‌మనీ వ్యాపారులకు తమ దగ్గర వున్న డబ్బును ఇస్తున్నారు. ప్రతిఫలంగా మూడు రూపాయల వడ్డీ పుచ్చుకుంటున్నారు. కాల్‌మనీ వ్యాపారులు ఆ డబ్బును తీసుకునేవారి అవసరం తీవ్రతను బట్టి మూడు నుంచి ఆరు రూపాయల వడ్డీకి తిప్పుతున్నారు. ఒక్క విజయవాడలోనే యాభైమందికి పైగా కాల్‌మనీ వ్యాపారులు వున్నారు. వారిలో 20 మంది ఈ వ్యాపారంలో బాగా ముదిరిపోయారు. ఈ వ్యవహారంలో దొరికిపోయిన ఒక ఎమ్మెల్యే కాల్‌మనీ వ్యాపారంలో వందకోట్లు తిప్పుతుంటే, మరో ఎమ్మెల్సీ కూడా వందకోట్లతో ఎంచక్కా వ్యాపారం చేస్తున్నాడు. ఒక్క విజయవాడలోనే ప్రతి ఏడా 15 వందల కోట్ల టర్నోవర్‌తో కాల్‌మనీ వ్యాపారం వర్ధిల్లుతోందంటే ఈ వ్యాపారం ఎంతలా వేళ్ళూనుకునిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత వ్యాపారం జరిగినా ప్రభుత్వానికి పన్నురూపంలో ఏమైనా ఆదాయం అభిస్తోందా అంటే... అదీ లేదు.. పెట్టుబడి, ఆదాయం... అంతా నల్ల డబ్బే...
కాల్‌మనీ కాలామనీ వ్యాపారంలో నల్లడబ్బు వున్న అనేకమంది పెట్టుబడులు పెట్టారు. ఒక మోస్తరు భూస్వాముల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకూ ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమ ఆదాయంలో చాలాభాగాన్ని ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ వ్యవహారం బయటపడి రచ్చ కావడంతో వాళ్ళు తమ పెట్టుబడులు తిరిగి రాకపోతే పోయె... ఈ ఇష్యూలో తమ పేరు వున్నట్టు బయట పడకూడదని గుర్తొచ్చిన దేవుడికల్లా మొక్కుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒక మంత్రిగారికి కూడా ఈ కాల్‌మనీ వ్యాపారులతో సంబంధ బాంధవ్యాలు వున్నట్టు తెలుస్తోంది. ఏ ఇష్యూ జరిగినా మీడియా ముందుకు వచ్చేసి గంటలు గంటలు మాట్లాడే ఆ మంత్రిగారు కాల్‌మనీ వ్యవహారం గురించి ఈ స్థాయిలో రచ్చరచ్చ అవుతున్నా ఎంతమాత్రం స్పందించలేదు. ఎందుకంటే పాపం ఆయన సన్నిహితులే ఈ వ్యాపారంలో వున్నారు. ఆయనేం మాట్లాడగలడు?
(కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తదుపరి ఆర్టికల్‌లో.....)