ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్న తెరాస ఎంపీలు

 

తెరాస నేతలు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అందరికంటే ముందు వారే కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కానీ మళ్ళీ వాళ్ళే అందుకు అడ్డుపడుతున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేమాటయితే తెలంగాణా రాష్ట్రానికి కూడా తప్పనిసరిగా ఇవ్వాలని మెలిక పెడుతున్నారు. అంతకంటే తమిళనాడు, ఓడిశా రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే తెలంగాణా ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని నేరుగా చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు ఇవ్వాలని మెలికపెడుతూ రాని ప్రత్యేక హోదాని రాకుండా అడ్డుకొంటున్నారు.

 

దేశంలో తెలంగాణా రాష్ట్రం రెండవ ధనిక రాష్ట్రమని, తెరాస ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యల వలన రాష్ట్రం అన్ని రంగాలలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలోనే తెలంగాణా రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలువబోతోందని పదేపదే చెప్పుకొంటారు. అయినా కూడా రాష్ట్ర విభజన కారణంగా అన్ని విధాల చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సమానంగా తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతుంటారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు తెలిసి ఉండకపోవచ్చును కానీ ఇంతవరకు కలిసి ఉన్న తెలంగాణాకి తెలియదనుకోలేము. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడటం చాలా విచారకరం.

 

లోక్ సభలో తెరాస పక్ష నేత జితేందర్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్న వై.వి. సుబ్బారెడ్డి అభ్యర్ధనను తాము సమర్ధిస్తున్నామని, అయితే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే మాటయితే తెలంగాణకు కూడా ఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సముఖంగా ఉన్నప్పటికీ ఇటువంటి కారణాల చేతనే వెనుకంజవేయవలసి వస్తోంది. ఒక్క ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే కాదు రైల్వే జోన్ వంటి మిగిలిన హామీల అమలుకు ఇటువంటి సమస్యలే అవరోధంగా నిలుస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu