నిన్న చంద్ర‌బాబు హౌజ్‌.. ఇవాళ‌ అయ్యన్న ఇల్లు.. వైసీపీ మూక‌దాడులు..

ఉండ‌వ‌ల్లి ర‌చ్చ నర్సీప‌ట్నంకు షిఫ్ట్ అయింది. శుక్ర‌వారం చంద్ర‌బాబు ఇంటిపై దాడితో ర‌చ్చ చేసిన వైసీపీ మూక‌లు.. శ‌నివారం టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటిపై అటాక్‌కు ప్ర‌య‌త్నించారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా వ‌చ్చారు. అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జ‌రిగింది. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర‌ ఉద్రిక్తత నెలకొంది. 

అయితే, వైసీపీ దాడిని ముందే ఊహించిన అయ్య‌న్న వ‌ర్గం.. పెద్ద సంఖ్య‌లో ఆయ‌న ఇంటి ముందు మోహ‌రించింది. అయ్య‌న్నపాత్రుడు ఇంటి ముట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే, ఆయ‌న అనుచ‌రులు వ‌స్తున్నార‌ని తెలుసుకున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీగా ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా త‌ర‌లివ‌చ్చారు. ఇరువైపులా పెద్ద సంఖ్య‌లో జ‌నం పోగ‌వ‌డంతో అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిద‌గ్గ‌ర హైటెన్ష‌న్ నెల‌కొంది. 

దీంతో పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వైసీపీ శ్రేణుల‌ను క‌ట్ట‌డి చేశారు. అక్క‌డి నుంచి బ‌ల‌వంతంగా త‌ర‌లించారు. దీంతో ఉద్రిక్త‌త స‌ద్దుమ‌నిగింది.

వైసీపీ నేత‌లు ఇలా దౌర్జన్యాలకు పాల్పడడడం మంచిది కాద‌ని టీడీపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చురేపుతున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలకంటే.. ప్రస్తుతం అయ్యన్న ఎక్కువగా మాట్లాడలేదని గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనల పేరుతో టీడీపీ నేతలను పరామర్శలకు కూడా అంగీకరించని పోలీసులు.. వైసీపీ నేతలకు మాత్రం గొడవలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారందరిపై కేసులు నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
 

Related Segment News