టీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం.. అమిత్‌షా చెప్పిందీ అదేనా..?

నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభ సక్సెస్. అదే రోజున గజ్వేల్‌లో కాంగ్రెస్ సభ గ్రాండ్ సక్సెస్. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మీద రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతమా? అంటే, కావచ్చును. అయితే ప్రతిపక్షాల  బహిరంగ సభలు సక్సెస్ కావడం ఒక్కటే ప్రభుత్వ వ్యతిరేకతకు కొలమానమా, అంటే..కాదు కానీ, జాగ్రత్తగా గమనిస్తే, గజ్వేల్’లో కాంగ్రెస్ కానీ, నిర్మల్’లో బీజేపీ కానీ, జన సమీకరణకు పెద్దగా ఒళ్ళు హూనం చేసుకోలేదు. గత నెలలో హుజూరాబాద్’లో దళిత బంధు ప్రారంభ సభకు, జనాలను సమీకరించేందుకు అధికార పార్టీ ఎంత హడావిడి చేసిందో చూశాం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇలా హేమాహేమీలు అందరూ జనసమీకరణ క్రతువును మినిట్ టూ మినిట్ మానిటర్ చేశారు. ఎమ్మెల్యేలకు టార్గెట్స్ ఫిక్స్ చేసి, ఏసీ బస్సులు పెట్టి, ఇంకా ఏవేవో చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా నడుం బిగిస్తే కానీ, సర్కార్ ఇజ్జద్  నిలవలేదు. దళిత బంధు సభ జన సమీకరణ ప్రయత్నాలతో  పోల్చిచూస్తే, గజ్వేల్, నిర్మల్ సభల సక్సెస్ కోసం కాంగ్రెస్, బీజేపీలు అంతగా కష్టపడవలసిన అవసరం రాలేదు. నిజమే, రెండు పార్టీలు జనసకరణకు కొంత ప్రయత్నం అయితే చేశాయి. కానీ,  చాలా వరకు జనం స్వచ్చందంగానే సభలకు హాజరయ్యారు. సక్సెస్ చేశారు. 

అదలా ఉంటే, అక్కడ నిర్మల్’లో బీజేపీ నాయకులు.. ఇక్కడ గజ్వేల్’లో కాంగ్రెస్ నాయకులు  సహజంగానే ఉమ్మడి శత్రువు, తెరాసను, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, ఫ్యామిలీనే టార్గెట్ చేశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి అదే భాషలో మాట్లాడారు. అదే సమయంలో, కాంగ్రెస్, బీజేపీల నాయకులు పరస్పర ఆరోపణలకు ఏ మాత్రం వెనకాడ  లేదు. ముఖ్యంగా చరిత్ర నుంచి.. నడుస్తున్న చరిత్ర వరకు మతపరంగా ఎవరు ఎవరి పక్షమో చాటుకునే ప్రయత్నం రెండు వైపులా నుంచి చేశారు. గజ్వేల్ సభకు ముఖ్య అతిధిగా వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే దేశంలో దళితులు, గిరిజనులు, బహుజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అలాగే, ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ సమర్దిస్తుందని చెప్పారు. 

మరోవంక నిర్మల సభకు ముఖ్య అతిధిగా వచ్చిన కేంద్ర హోం మంత్రి మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ, ప్రభుత్వం వ్యతిరేకమని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న మైనారిటీ రిజర్వేషన్ రద్దు చేయాలని డిమాండ్ సైతం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే లౌకిక వాద పార్టీలు అనుసరిస్తున్న ముస్లిం సంతృష్టీకరణ విధానాలను ఎండ కట్టారు. తెరాస ప్రభుత్వం ఎంఐఎంకు భయపడుతోందని, తమ పార్టీ ఎవరికీ భయ పడదని అన్నారు. అలాగే, తెలంగాణ కారు తెరాస‌దే,  కేసీఆర్’దే అయినా స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉందని చురకలు అంటించారు. ఒవైసీలకు భయపడే కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించ‌డం లేద‌న్నారు. తాము అధికారంలోకి వ‌స్తే అధికారికంగా విమోచ‌న దినం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. 

ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికీ మతం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు చెరో గట్టున ఉన్నాయి అనేది సెప్టెంబర్ 17 న మరో మారు స్పష్టమైంది. అంతే కాదు, ముందు ముందు రెండు పార్టీలు అదే కార్డు ప్లే చేసేందుకు సిద్దమవుతున్నాయి అనే విషయంలో కూడా స్పష్టమైంది. నిజానికి జాతీయ స్థాయిలో కూడా అదే ధోరణి కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కశ్మీర్’లో పర్యటించిన రాహుల గాంధీ, తానూ కశ్మీరీ హిందువునని ప్రకటించుకున్నారు. అలాగే, ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీనే నిజమైన హిందూ పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
అదలా, ఉంటే తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందని, అమిత్ షా పరోక్షంగానే అయినా అంగీకరించారు. అయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించి పోతోంది కాబట్టి రాష్ట్రంలోనూ తెరాసకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని అమిత్  షా సూత్రీకరించారు. అదెలా  ఉన్నా, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ‘దే పై చేయని అమిత్ షా అంగీకరించడం సెప్టెంబర్ 17 రాజకీయానికి కొసమెరుపు.
 

Related Segment News