బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తాం.. రాజ‌ద్రోహం కేసు పెడ‌తాం.. రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్‌

డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఆ డ్ర‌గ్స్ బుర‌ద‌లోకి కేటీఆర్‌నూ లాగారు రేవంత్‌రెడ్డి. నేరుగా ఇలా అని అన‌కుండా.. ప‌రోక్షంగా.. కేటీఆర్‌.. గోవా.. డ్ర‌గ్స్.. ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.. ఇలా పొడిపొడిగా మాట్లాడి.. మేట‌ర్‌ అర్థ‌మ‌య్యేలా మెసేజ్ ఇచ్చారు. అటు బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ సైతం కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు గ్లామ‌ర్ కోసం డ్ర‌గ్స్ వాడుతున్నారంటూ ప‌రోక్షంగా కేటీఆర్‌నే టార్గెట్ చేశార‌ని అంటారు. ఇలా, కేటీఆర్‌కు డ్ర‌గ్స్ మ‌కిలి బాగానే అంటించేస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు. 

ఇక గ‌జ్వేల్ స‌భ‌లోనైతే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మ‌రింత సూటిగా ఆరోప‌ణ‌లు చేశారు. తండ్రి తాగుబోతుల‌కు, కొడుకు డ్ర‌గ్స్ వాడేవారికి అంబాసిడ‌ర్లుగా మారారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో, కేటీఆర్ డ్ర‌గ్స్ వాడ‌తారా? కేటీఆర్‌కు డ్ర‌గ్స్ దందాకు లింకుందా? కేటీఆర్ గోవా అందుకే వెళ్లారా? ఇలా ర‌క‌ర‌కాల ఊహాగానాలు.. అంత‌కుమించి అనుమానాలు.

విష‌యం ముద‌ర‌డంతో కేటీఆర్ ఆ ఆరోప‌ణ‌ల‌పై స్పందించాల్సి వ‌చ్చింది. తాజాగా మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. త‌న‌కూ డ్రగ్స్‌కు ఏం సంబంధం?.. ఏ పరీక్షకైనా తాను సిద్ధమంటూ స‌వాల్ చేశారు. బ్ల‌డ్ టెస్ట్‌, లివ‌ర్ టెస్ట్ ఏదైనా చేయించుకోవ‌డానికి సిద్ధ‌మ‌ని.. ద‌మ్ముంటే రాహుల్‌గాంధీ కూడా డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల‌కు రావాల‌ని స‌వాల్ చేశారు. త‌న‌పై ఇలా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోమ‌ని.. అవ‌స‌ర‌మైతే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని రేవంత్‌రెడ్డిని హెచ్చ‌రించారు కేటీఆర్‌. ఎవ‌డో గాడిద త‌న‌పై ఈడీకి ఫిర్యాదు చేశాడ‌ట అంటూ రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నోటికొచ్చిన‌ట్టు వాగితే.. బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్‌. 

రేవంత్‌రెడ్డిపై మ‌రిన్ని విమ‌ర్శ‌లు చేశారు కేటీఆర్‌. 50 కోట్లతో పీసీసీ కొనుక్కున్నారని ఆ పార్టీ నేత అన్నారు. పీసీసీ కొనుక్కున్న నేత రేపు ఎమ్మెల్యే టిక్కెట్టు అమ్ముకోరా? పెయింటింగ్‌ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయి? ఒకప్పుడు సున్నమేసిన వ్యక్తి.. ఇవాళ కన్నమేస్తున్నారు. అంటూ రేవంత్‌రెడ్డిపై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు మంత్రి కేటీఆర్‌.