నవ్వుల  చిత్రాలు ఎన్నెన్నో..!

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత అయిన జంధ్యాల. ఈయన నవ్వు గురించి చెప్పినప్పుడు ఆ నవ్వు ప్రాముఖ్యత ప్రజలకు అంతగా తెలియలేదు. కానీ ఇప్పుడూ లాఫింగ్ క్లబ్బులు పెట్టుకుని మరీ నవ్వేస్తున్నారు. నవ్వు ఓ గొప్ప ఔషధం అని వైద్యులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. ఒక చిన్న నవ్వుతో ఎలాంటి వారిని అయినా గెలవచ్చు, ఎంత కఠిన హృదయం గలవారిని అయినా మార్చేయచ్చు అంటారు. అసలు నవ్వుకు ఇంత గొప్ప శక్తి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నవ్వుకున్న గొప్పదనాన్ని గుర్తుచేసుకుంటూ, నవ్వుతో ప్రపంచాన్ని కాస్తో కూస్తూ మార్చాలనే తపనతో ప్రతి ఏడాది నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా. ఒక మనిషి జీవితంలో నవ్వు ఎంత మార్పు తెస్తుందో.. ఎలాంటి మార్పు తెస్తుందో కాసింత వివరంగా తెలుసుకుంటే


ఔషధం..

నవ్వును ఔషధం అంటుంటే చాలామందికి కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది అక్షరాలా నిజం. సైన్సే కూడా ఇదే నిజమని చెప్పింది. నవ్వినప్పుడు శరీరంలో విడుదల అయ్యే హ్యాపీ హార్మోన్లు మనిషికి ఉన్న ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలను సులువుగా తగ్గిస్తుంది. అందుకే నవ్వును ఔషధం అన్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఎలాంటి సంకోచం లేకుండా కొన్ని సెకెన్ల నుండి నిమిషాల పాటూ  అలా పెదవులు సాగదీసి నవ్వితే ఇక ఆ రోజంతా చాలా హ్యాపీ మూమెంట్లోనే గడిచిపోతుంది.


పాజిటివ్..

మనిషి జీవితంలో పాజిటివ్, నెగిటివ్ అంటూ రెండూ ఉన్నాయి. పాజిటివ్ ఆలోచనలు మనిషి జీవితంలో ఉన్నతికి తోడ్పడతాయి. నెగిటివ్ ఆలోచనలు ఉంటే మనిషి పతనానికి కారణం అవుతాయి. పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగించడంలో నవ్వుదే కీలక  పాత్ర. ఎవరితోనైనా బాగా గొడవ పడినప్పుడు వారితో విభేదాలు వచ్చినప్పుడు ఇక వారితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ వారు ఎప్పుడైనా తారసపడినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి చూడండి. పాత గొడవలు, కలహాలు అన్నీ మర్చిపోయి వారు కూడా తిరిగి నవ్వుతారు. మళ్ళీ బంధం చిగురిస్తుంది.

విజయానికి మెట్టు..

నవ్వు విజయానికి తొలిమెట్టు అవుతుంది. నవ్వు వల్ల జీవితంలో ఎంత కష్టాన్ని అయినా సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఎక్కడలేని ఓర్పు, సహనం, నవ్వుతో వచ్చేస్తాయి. నవ్వుతూ ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తే ఇంకొకరు విజయంలో భాగస్వాములు కూడా అవుతారు.

సంబంధాలు..

పైన చెప్పుకున్నట్టు.. మనుషుల మధ్య ఎలాంటి సమస్యలున్నా నవ్వు పరిష్కరిస్తుంది. ఎంత గొడవ వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నవ్వుతూ సర్థి చెప్పడం వల్ల పెద్దగా మారాల్సిన గొడవలను చిన్నగా ఉండగానే పరిష్కరించుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు, ఆఫీసులో కొలీగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వు వల్ల బలంగా ఉండే బంధాలు బోలెడు.


                                                  *నిశ్శబ్ద.