జవాబుదారీ తనం ఏదీ ఎక్కడ?

ఒడిశాలో మూడు రెైళ్లు ఢీకొన్న ఘటనలో  దగ్గరదగ్గర మూడు వంద ల మంది మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగి గంటలు గడిచినా ఇంకా సహాయక కార్యక్రమాలు పూర్తికాలేదు. బోగీల్లో ఎంత మంది చిక్కుకుని ఉన్నారన్న దానిపై స్పష్టత రాలేదు. రైల్వే మంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి, తమిళనాడు నుంచి ముగ్గురు మంత్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. మృతుల కుంటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

అయితే  రైలు ప్రమాదాల నివారణకు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో, దానిని వినియోగించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ఒడిశా రైలు ప్రమాద ఘటన నిలువెత్తు నిదర్శనమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలో, సంబంధిత మంత్రిలో జవాబుదారీ తనం ఎక్కడుందన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఒడిశా ప్రమాద ఘటనే తెలుసుకుంటే ఈ ప్రమాదం వెనుక కనిపిస్తున్నది నిర్లక్ష్యమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను వినియోగంలోకి తీసుకురావడంలో  అలవిమాలిన నిర్లక్ష్యం చూపుతున్న కేంద్రం.. విపక్ష నేతల కదలికలపై నిఘా కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.  

గతంలో రైలు ప్రమాద ఘటనలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే మంత్రుల ఉదంతాలను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 1956 నవంబర్ లో తమిళనాడులోని అరియాలూర్ లో రైలు ప్రమాదం జరిగి 142 మంది మరణించారనీ, ఆ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన మంత్రి పదవికి రాజానామా చేశారు.  అంతకు ముందు 1956  ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ వద్ద రైలు ప్రమాదం సంభవించి 112 మంది మరణించిన సందర్భంలో కూడా రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు.

అయితే ప్రధాని నెహ్రూ అయన రాజీనామాను ఆమోదించలేదు. ప్రధాని గట్టిగా చెప్పడంతో అప్పటికి ఊరుకున్న లాల్ బహదూర్ శాస్త్రి అదే ఏడాది నవంబర్ లో  మరో రైలు ప్రమాదం జరగడంతో నెహ్రూకు తిరస్కరించే అవకాశం లేకుండా మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమోదించి తీరాల్సిందే అని పట్టుబట్టి మరీ పదవి నుంచి వైదొలగారు. ఇక 1999 ఆగస్టలో అసోంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి నితీష్ కుమార్ సైతం తన పదవికి రాజీనామా చేశారు.  ఆ తురువాత కూడా 2000 సంవత్సరంలో జరిగిన రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ చేసిన రాజీనామాను అప్పటి ప్రధాని వాజ్ పేయి ఆమోదించలేదు.

అలాగే 2106లో పాట్నా సమీపంలో రైలు ప్రమాదం జరిగి 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేసిన రాజీనామాను ప్రధాని మోడీ ఆమోదించలేదు. అయితే తాజాగా ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చినా దానిని వినియోగించుకోవడంలో విఫలం కావడం వల్ల జరిగిన ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ను కనీసం ఆయన పరిగణనలోనికి తీసుకోకపోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.   మోడీ సర్కార్ లో మంత్రులలో జవాబుదారీ తనం కనిపించడం లేదన్న విమర్శలు చాలా కాలంగా వినవస్తున్న సంగతి తెలిసిందే.