రైలు ప్రమాద బాధితుల కోసం స్వచ్ఛందంగా రక్తదానం

ఒక విపత్తు సంభవించినపుడు, ఒక మహా విషాదం జరిగినప్పుడు జనం స్వచ్ఛందంగా సహాయ హస్తం అందించేందుకు ముందుకు రావడం భారత్ డీఎన్ ఏలోనే ఉంది. దివిసీమ ఉప్పెన, కోనసీమ ఉప్పెన వంటి సంఘటనలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడానికి యావద్దేశం ముందుకు వచ్చింది.

అలాగే  ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 300 మందికి పైగా మరణించి, వెయ్యి మందికి పైగా గాయపడిన సందర్భంలో  క్షతగాత్రులకు రక్త దానం చేయడానికి జనం ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు.  ఆస్పత్రులలో చేరిన క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటమే కాకుండా వారికి అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉండటంతో  రక్త దానం చేయడానికి బాలాసోర్ ఆస్పత్రికి వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు.

బాధితులకు ఆదుకోవడానికి తమ వంతు సాయంగా రక్తదానం చేయడానికి వాళ్లంతా స్వచ్ఛందంగా వచ్చారు. అలాగే ఘటనా స్థలం వద్ద స్థానికులు యుద్ధ పాత్రిపదికన జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.

  బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలోనూ, గాయపడిన వారిని అంబులెన్సులలోకి చేర్చడంలోనూ సహాయక బృందాలకు సహాయం అందిస్తున్నారు.  రైలు ప్రమాదం జరిగిన శుక్రవారం రాత్రి నుంచి జనం ఎడతెరిపి లేకుండా వారి వంతు సహాయం వారు అందిస్తున్నారు.