భగవద్గీత పుస్తకాలతో వినాయక విగ్రహం
posted on Aug 28, 2025 1:02PM

దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో, అత్యంత ఘనంగా గురువారం (ఆగస్టు 27)న జరుపుకున్న సంగతి తెలిసిందే. వాడవాడలా గణేస్ మంటపాలను ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలను వేడుకగా జరుపుకోనున్నారు. అయితే పందిళ్లలో వినాయ విగ్రహాల ఏర్పాటులో నిర్వాహకులు తమ సృజనాత్మకతను ఆవిష్కరిస్తున్నారు. వినూత్న రూపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకుంటున్నారు.
ఈ క్రమంలో చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ విగ్రహం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. చెన్నైలోని మన్నాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ మండపంలో గణనాథుడి విగ్రహాన్ని పూర్తిగా పుస్తకాలతో రూపొందించారు. ఇందు కోసం నిర్వాహకులు ఐదు వేల భగవద్గీత పుస్తకాలను ఉపయోగించారు. వీటితో పాటుగా 1500 'వేల్ విరుత్తమ్', 1008 'మురుగన్ కావసం' వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా ఉపయోగించారు. ఐదు వేల బగవద్గీత పుస్తకాలతో రూపొందించిన గణనాథుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఈ మంటపానికి తరలి వస్తున్నారు. ఇక ఈ మండపం వద్ద పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా నిర్వాహకులు అన్ని చర్యలూ తీసుకున్నారు. భజనలు, సంకీర్తలలతో మండపం, పరిసర ప్రాంతాలు ఆధ్మాత్మిక శోభతో అలరారుతున్నాయి.