గూగుల్ మ్యాప్ బోల్తా కొట్టించింది.. వరదలోకి దారి చూపింది!

గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ప్రయాణాలు సాగించడం ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకువస్తున్నది. అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా, ప్రయాణాలు చేసేవారు ఆ మ్యాప్ ల మీదే ఆధారపడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ ప్రయాణం చేస్తున్న ఓ కుటుంబంలో ఘోర విషాదం సంభవించిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని  సవాయి భోజ్‌ను  దర్శించుకుని వ్యాన్ లో తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం గూగూల్ మ్యాప్ సూచించిన విధంగా ప్రయాణం చేస్తున్నారు.

అయితే ఆ మ్యాప్ వారిని నేరుగా బనాస్ వరద నీటిలోకి గైడ్ చేసింది. దీంతో వారు ప్రయాణిస్తున్న వ్యాన్  వరద నీటిలో కొట్టుకుపోయింది. చిత్తోర్ ఘడ్ జిల్లా  రష్మి పోలీస్ స్టేషన్ పరిధిలో  జరిగిన ఈ ఘోర ఘటనలో ఓ బాలిక మరణించింది. మరో ముగ్గురు గల్లంతయ్యారు.  స్థానికుల సహకారంతో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు.  వివరాలిలా ఉన్నాయి. రాజ్‌సమంద్ జిల్లాకు చెందిన గదరి వర్గానికి చెందిన కుటుంబం విహార యాత్ర కోసం భిల్వారాలోని సవాయి భోజ్‌ను సందర్శించింది. తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్‌లో చూపిన మార్గాన్ని అనుసరించి వారు రష్మి పీఎస్ పరిధిలోని సోమి–ఉప్రెడా మధ్యనున్న కల్వర్ట్  మీదుగా ప్రయాణించాల్సి ఉంది. వాస్తవానికి ఆ కల్వర్ట్ గత మూడేళ్లుగా బంద్ అయి ఉంది.  దానిపై రాకపోకలను నిషేధించారు. అయితే గూగుల్ మ్యాప్ ఆ కల్వర్టు మీదుగానే ప్రయాణించాలని సూచించడంతో వారు అ లాగే ముందకు సాగారు. కానీ ఇటీవలి భారీ వర్షాలకు  బనాస్ నదికి వరద పోటెత్తి ఆకల్వర్టు మార్గాన్ని ముంచేసింది.

అయితే గూగుల్ అంటూ ముందుకు సాగిన వారు, తమ వ్యాన్ ను కల్వర్ట్ పైకి తీసుకు వెళ్లారు. అయితే వరద ప్రవాహానికి ఆ వ్యాన్ కొట్టుకుపోయింది. ఈ ఘటన  జరిగిన సమయంలో వ్యాన్ లో తొమ్మండుగురు ఉణ్నారు.  స్థానికులు వెంటనే స్పందించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత పోలీసులు స్థానికుల సహకారంతో ఐదుగురిని రక్షించగలిగారు. ఒక బాలిక మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుడ్డిగా గూగుల్ మ్యాప్ లను చూసి ప్రయాణాలు సాగించడం ప్రమాదకరమని ఈ ఘటనతో మరోసారి రుజువైందని పరిశీలకులు అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu