కొవిడ్ పై గ్రామస్తుల యుద్ధం.. సొంతంగానే కేర్ సెంటర్ 

దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. వేగంగా విస్తరిస్తూ రోజుల్లోనే లక్షలాది లక్షలాది మందిని బలి తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ పంజా విసిరింది. రోజూ వేలల్లో కేసులు నమోదు కాగా...  రోగులకు హాస్పిటల్స్ లో  బెడ్లు దొరకలేదు. బెడ్ దొరికనా ఆక్సిజన్ అందలేదు.. దీంతో అంతా చూస్తుండగానే జనాలు పిట్టల్లా రాలిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత దయనీయ పరిస్థితులు. ఇంట్లోనే సెల్ఫ్ ఐసో‌లేషన్‌లో ఉందామంటే ఇరుకు గదులతో ఇబ్బందులు.. ప్రైవేట్ దవాఖానాలో చేరాలంటే సరిపోని స్థోమత. ఇక పాజిటివ్ రోగులను పొలిమేరల్లో అడుగుపెట్టనివ్వని గ్రామాలు. నిత్యం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏకమైన ఒక ఊరి జనం.. తామే ఓ కొవిడ్ కేర్ సెంటర్ నిర్మించుకుని మిగతా పల్లెలకు ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు చుట్టుపక్కల పల్లెల్లోని కొవిడ్ బాధితులకు సైతం అండగా ఉంటున్నారు. 

తూర్పు గోదావరి జిల్లా, గొల్లల మామిడాడ గ్రామస్తులు ఫస్ట్ వేవ్ లో కరోనావైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ తరువాత కేసులు తగ్గినా.. ప్రస్తుత సెకండ్ వేవ్‌లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. దగ్గరి బంధువులను, ప్రియమైన వారిని, స్నేహితులను కోల్పోయారు. చాలా మంది ప్రజలు ఆక్సిజన్ కొరతతో  చనిపోయారు. ఈ సంఘటనలతో గుణపాఠాలు నేర్చుకుని..   అటువంటి మరణాలను తగ్గించాలని నిర్ణయించారు.కొవిడ్ కేర్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఒకరికొకరు సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు.. బాధిత కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే యువత, వలంటీర్లతో పాటు గ్రామస్తులంతా చందాలు వేసుకుని దాదాపు రూ.50 లక్షలు సేకరించారు. 

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 30 పడకల సామర్థ్యంతో కొవిడ్ కేర్ సెంటర్‌ను సొంతంగా నిర్మించుకున్నారు. 30 బెడ్లకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శుక్రావరం ఈ కొవిడ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. అన్ని పడకలలో ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న కోవిడ్ రోగులకు ఉచితంగా ప్రథమ చికిత్సతో పాటు పూర్తి స్థాయి చికిత్స, ఆక్సిజన్ అందిస్తున్నారు.  ప్రభుత్వాస్పత్రుల్లోని లోపాలు, ప్రైవేట్ దవాఖానాల దోపిడీని ఎదుర్కొనేందుకు  మామిడాడ గ్రామస్తులు చేసిన ప్రయత్నం... ఇప్పుడు ఇతర గ్రామాలకు స్పూర్తిగా నిలుస్తోంది. తమ గ్రామస్తులకే కాకుండా సమీప పల్లె జనాలకు సైతం చేయూతనిచ్చేందుకు  మామిడాడ గ్రామస్తులు సిద్ధమయ్యారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu