అమిత్‌షాతో సుజనాచౌదరి.. విజయసాయికి భయం ఎందుకు?
posted on Oct 29, 2021 10:46AM
ఈ ఫోటో చూడండి.. ఇందులో ఏమైనా ప్రత్యేకత కనిపిస్తుందా? ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. మరోకరు కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ్య సభ్యులు సుజనాచౌదరి. వారిద్దరూ బీజేపీ నాయకులే. ఒకే పార్టీ నేతలు.. కేంద్రంలో మాజీ సహచరులు.. ఏదో మాట్లాడుకుంటున్నారు. పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ మీటింగ్ సందర్భంగా అమిత్‌షా-సుజనాలు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తుండగా తీసిన ఫోటో ఇది. అంతే. దీని వెనకా-ముందూ ఇంకేం లేదు. కానీ.. ఈ ఫోటోను చూసి వైసీపీ ఏ2కు వణుకు పుడుతున్నట్టుంది. జస్ట్ క్యాజువల్‌గా తీసిన ఈ పిక్.. వైసీపీ పెద్దలను ఉలిక్కిపడేలా చేస్తున్నట్టుంది. అందుకే, విజయసాయిరెడ్డి గుడ్డు మీద ఈకలు లాగుతున్నారు. ఈ ఫోటోకు అర్థాలు-పెడర్థాలు తీస్తున్నారు. తన భయాన్ని పరోక్షంగా వ్యక్తం చేస్తూ.. ఈ ఫోటో వెనుక కారణం ఇదీ అంటూ ఓ పులిహోర ట్వీట్ చేశారు. ఇంతకీ విజయసాయిరెడ్డి క్రియేట్ చేసిన ఆ కథ ఏంటంటే...
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ అమిత్‌షాను సుజనాచౌదరి ప్రాధేయపడుతున్నారంటూ సీన్ క్రియేట్ చేశారు విజయసాయిరెడ్డి. సుజనాచౌదరి బీజేపీలో ఉన్నా టీడీపీ కోసం, తన రియల్ బాస్ చంద్రబాబు కోసం పని చేస్తున్నారంటూ అక్కస్సు వెళ్లగక్కారు. ఈ ఫోటో వెనుక ఇంత మర్మం దాగున్నట్టు.. కామెంట్లు చేశారు. ఆ ఫోటో తీసింది విజయసాయిరెడ్డినే కావొచ్చు.. అందుకే వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఆయనకు స్పష్టంగా వినిపించినట్టుంది. అందుకే అలా జరిగిందంటూ ఇలా ట్వీట్ చేశారేమో.
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది విజయసాయి తీరు. అమిత్‌షా, సుజనాచౌదరీలు వాళ్లేదో నడుస్తూ వెళ్తూ చిట్‌చాట్‌గా మాట్లాడుకుంటే.. ఈయన గారు ఆ ఫోటోను పట్టుకొని ఇంతగా సీన్ క్రియేట్ చేయడం.. వెనుక వైసీపీ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షానే స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు తాను కశ్మీర్ పర్యటనలో ఉన్నానని అందుకే కలవలేకపోయానని చెప్పారు. ఏపీలో వైసీపీ అరాచక పాలన గురించి, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడుల గురించి అమిత్‌షాకు చంద్రబాబు వివరించారు కూడా. ఇక మళ్లీ అపాయింట్‌మెంట్ ఎందుకు? అడిగితే గిడిగితే టీడీపీ ఎంపీలు ఉన్నారుగా వాళ్లు చూసుకుంటారు? మధ్యలో బీజేపీ నేత సుజనాచౌదరి జోక్యం ఏముంటుంది? ఇదంతా.. సుజనాచౌదరి బీజేపీలో ఉన్న టీడీపీ-చంద్రబాబు మనిషంటూ తప్పుదారి పట్టించేందుకు విజయసాయిరెడ్డి చేస్తున్న కుతంత్రం మాత్రమే అంటున్నారు. అందుకే, విజయసాయి కుట్రలపై మరో బీజేపీ నేత లంకా దినకర్ కౌంటర్ ఇచ్చారు.
అమిత్‌షా-విజయసాయిరెడ్డి కలిసున్న ఫోటోను చూసి విజయసాయిరెడ్డికి అంత భయమెందుకు అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. వైసీపీది అసమర్థ ప్రభుత్వం కాబట్టే.. వారంతాగా భయపడుతున్నారంటూ కౌంటర్ వేశారు.
