టీఆర్ఎస్ కు ఆర్ కృష్ణయ్య  సపోర్ట్.. కేసీఆర్ ఎమ్మెల్సీ బిస్కెట్? 

హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక రేపింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా నడిచింది. మొదటి నుంచి బీసీ నేతగానే ఎదిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉండటంతో బీసీ సంఘాల మద్దతు ఆయనకే ఉంటుందని అంతా భావించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీసీ అయినప్పటికి.. తెలంగాణలో కీలక నేతగా ఉన్న ఈటల.. ఉప ఎన్నికలో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్య్రర్థి రేసులో ఉంటారనే చర్చ కూడా ఉంది. బీసీ సంఘాలు కూడా ఇదే అభిప్రాయంతో రాజేందర్ వైపు ఉన్నారని అనుకున్నారు.

కాని ప్రచార గడువు ముగిసే రోజు బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య షాకింగ్ ప్రకటన చేశారు. ఈటల రాజేందర్ కు కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు కారణం కూడా చెప్పారు ఆర్ కృష్ణయ్య. ఈటల రాజేందర్ భార్య రెడ్డి సామాజిక వర్గమని.. గెల్లు కుటుంబం మొత్తం బీసీలేనని చెప్పారు. అందుకే నిఖార్సైన బీసీ అయిన గెల్లు శ్రీనివాస్ కు సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు కొన్ని గంటల ముందు అధికార పార్టీకి మద్దతు ఇస్తూ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ప్రకటన చేయడం సంచలనంగా మారింది. 

టీఆర్ఎస్ కు బీసీ సంఘం నేత మద్దతు ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్ కృష్ణయ్యకు సంబంధించి మరో వార్త కూడా  వైరల్‌గా మారింది.  గెల్లు శ్రీనివాస్‌కే మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించడంతో.. త్వరలో ఆర్‌. కృష్ణయ్య  అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కృష్ణయ్యకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారని చెబుతున్నారు. ఆర్. కృష్ణయ్య ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు, టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.  ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu