ఏబీవీ కొత్త పార్టీ?!

దేశంలో ఇప్పటికే స‌వాల‌క్ష పార్టీలు ఉన్నాయి. వీటిలో యాక్టివ్ గా ఉన్న‌వి కొన్నే. వాటిలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల‌తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణ‌మూల్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు వీటికి అద‌నం.

ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే తెలుగుదేశం, వైసీపీ,  జ‌న‌సేన‌,  డీఎంకే, అన్నాడీఎంకే, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలనూ కలిపితే దాదాపు ఓ పాతిక పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పవచ్చు.  అలాంటి యాక్టీవ్ పార్టీల‌న్నిటినీ  ప‌క్క‌న పెడితే..   దేశంలో ఉన్న పార్టీల సంఖ్య సుమారు రెండున్న‌వేల వ‌ర‌కూ ఉంటాయి.

రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న  తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ  కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   ఆ పార్టీ పేరు ఇంకా  ఖరారు కాలేదు కానీ, పార్టీ ఏర్పాటైతే పక్కా అంటున్నారు. ఇంతకీ ఆ పార్టీని ఏర్పాటు చేస్తున్నది ఎవరయ్యా అని చూస్తే.. ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు.

ఈయ‌న జ‌గ‌న్ జ‌మానాలో ఎన్నేసి అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారో  తెలిసిందే. ఇటీవ‌ల ప్ర‌వీణ్ ప్ర‌కాష్ చెప్పిన అపాల‌జీ వీడియోనే ప్ర‌త్య‌క్ష  సాక్షి. అదలా ఉంచితే..  ఏబీవీకి ఇంకా ప్ర‌భుత్వ ప‌రంగా రావ‌ల్సిన బ‌కాయిలు ఇప్పటికీ  రాలేదు.

వాస్తవానికి ఏబీవీ   జ‌గ‌న్ పై పోరాడిన విధానికి కూట‌మి ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించాల్సి ఉంది. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఏబీవీకి ఎటువంటి మద్దతూ లభించలేదు.  అప్ర‌ధాన్య‌మైన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని అప్పగించి మమ అనేశారు. అయితే ఆయనా పోస్టు తీసుకోలేదనుకోండి అది వేరే సంగతి. అయితే   ఏబీవీ ప్ర‌స్తుతం చంద్ర‌బాబు మీద ఆయ‌న ప్ర‌భుత్వ విధానాల‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు.   అంతే కాదు వైసీపీ వారికి య‌ధేచ్చ‌గా దోచి పెడుతున్నార‌న్న సంచ‌ల‌న కామెంట్లు కూడా చేశారు.

ఆమాట‌కొస్తే మొన్న‌టికి మొన్న కందుకూరు క‌మ్మ  కాపు ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం  ఇచ్చిన న‌ష్ట‌ప‌రిహారంపై కూడా రియాక్టయ్యారు ఏబీవీ. ఇలా తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వ నిర్ణయాలను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏబీ వెంకటేశ్వరరావు.   ఇలా ఖండనలు, ప్రకటనలతో కాదని తానే స్వయంగా ఒక కొత్త  పార్టీ  పెట్టి  సత్తా చాటాలన్న నిర్ణయానికి ఏబీవీ వచ్చినట్లు కనిపిస్తోంది.  

దేశంలోనే అత్యంత అవినీతి ప‌రుడిగా  వేల కోట్ల‌ను సంపాదించిన పేరు సాధించిన  జ‌గ‌నే పార్టీ న‌డ‌ప‌డానికి  డ‌బ్బుల్లేవు కాబ‌ట్టి తాను  కార్యాల‌యాన్ని తీసేశాన‌ని బాహ‌టంగా చెప్పుకున్నారు. అలాంటిది ఏబీవీ లాంటి ఒక రిటైర్డ్ ప్ర‌భుత్వోద్యోగి వ‌ల్ల సాధ్య‌మ‌వుతుందా? అని సందేహాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

అయితే  జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ లోక్ స‌త్తా  అరవింద్ కేజ్రీవాల్  ఆమ్ ఆద్మీ పార్టీ,  సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ కూడా సేమ్ టు సేమ్  ఈయ‌న‌లాగానే ఐఏఎస్ ఐపీఎస్ కేడ‌ర్ కి సంబంధించిన వారే. వారిలో అర‌వింద్ కేజ్రీవాల్ పార్టీ క్లిక్ అయిన‌ట్టు మిగిలిన వారు పెట్టిన పార్టీలు రాణించ‌లేదు.  ఆ  కోవ‌లోకి వ‌చ్చే ఏబీవీ అంత‌గా మాస్ జ‌నాల్లోకి దూసుకెళ్ల‌గ‌ల‌రా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా  మారింది. 

ఇక పార్టీ పేరు ఏమిటని చూస్తూ.. ఈయన ఏపీకి పరిమితమై రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు కనుక ఆంధ్ర శ‌బ్ధం వ‌చ్చేలా ఆయన పార్టీ పేరు ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా ఏబీవీ పెట్టబోయే పార్టీ ఏమిటి? ఎప్పుడు ఆరంభం కానుంది? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu