ఏపీ గ్రోత్ రేట్@10.5%
posted on Dec 6, 2025 9:44AM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటోంది. ఈ ఏడాది ఏపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. వైసీపీ హయాంలో ఏపీ ప్రగతి తిరోగమనంలో సాగిన సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 8.8 శాతం ఉంటే, ఒక్క అంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ సగటును మించిన వృద్ధి రేటు సాధించింది.
ఈ వేగం ఇలాగే సాగితే ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు 18 లక్షల 65 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం వ్యవసాయానిదే అని చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ ఉత్పత్తులు 9.6 శాతం పెరిగి 81 వేల 496 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఈ వృద్ధి 36 శాతంగా ఉంది. అలాగే సేవల రంగం 8.5 శాతం, పరిశ్రమలు 23 శాతం పెరిగాయి. ఈ మూడు రంగాలూ ఒకేసారి బలపడటం వల్లనే ఆర్థిక వ్యవస్థ పునాది గట్టిపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం 2.4 లక్షల కోట్ల డాలర్లకు , తలసరి ఆదాయం 35 లక్షల రూపాయలు చేరాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం దిశగా తొలి అడుగు పడిందనే తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. పథకాల అమలులో వేగం, అధికారుల చొరవ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ అన్నీ కూడా ఏపీ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయని చెప్పాలి.
సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రాకు 38 శాతం వాటా ఉంది, దాదాపు 7.74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 28 వేల 409 మెగావాట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల్లో డబ్బు లభ్యత పెంచడం వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది. జగన్ హయాంలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఇప్పుడు కోలుకుని వేగంగా ముందుకు సాగుతోంది.