రెజ్లర్ సుశీల్ దాడి దృశ్యాలు.. వీడియో వైరల్..
posted on May 28, 2021 11:53AM
రెజ్లర్ సుశీల్ కుమార్.. మరో యంగ్ రెజ్లర్ సాగర్ రాణాపై దాడి చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. సుశీల్ అరెస్ట్ తర్వాత.. తాజాగా ఆ వీడియో బయటకు వచ్చింది. సుశీల్ అటాక్ వీడియో సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
అసలే ప్రపంచస్థాయి కుస్తీ యోధుడు. అతని కండల్లో కొండంత బలం. చేతులతో కొడితేనే.. పిండి పిండి అయిపోతాం. అలాంటిది బేస్‌బాల్ స్టిక్‌తో కొడితే ఉంటారా? అదే జరిగింది.. సుశీల్‌కుమార్ కొట్టిన దెబ్బలు తాళలేక.. సాగర్ రాణా చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వెలుగు చూసింది.
ఛత్రసాల్ స్టేడియంలో రాత్రివేళ పది మందికి పైగా కలిసి రాణాపై దాడి చేశారు. ఆ వీడియోలో సుశీల్ బేస్‌బాల్ స్టిక్ పట్టుకొని ఉన్నాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో.. ఇక సుశీల్ కుమార్ కేసులో మరింతగా చిక్కుకున్నట్టే. శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం తక్కువే.
రెండు వారాల క్రితం ఛత్రసాల్ స్టేడియంలో సాగర్‌రాణాపై సుశీల్ బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. తనంటే అందరికీ భయం ఉండాలని, తన ఆధిపత్యాన్ని అంగీకరించాలన్న ఉద్దేశంతో తన మిత్రుడి చేత సుశీల్ ఈ వీడియో తీయించాడు. దానిని రెజ్లింగ్ వర్గాలకు పంపించాలనుకున్నాడు. కానీ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణా రెండు రోజుల తర్వాత చనిపోవడంతో అతడు పారిపోయాడు. ఆ తర్వాత సుశీల్ కోసం పోలీసుల గాలింపు.. అతను పరారీలో ఉండటం.. లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం.. లక్ష రూపాయల రివార్డు ప్రకటించడం.. ముందుస్తు బెయిల్ తిరస్కరణ.. ఇలా వరుస పరిణామాల తర్వాత ఎట్టకేళకు ఇటీవలే సుశీల్‌ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. పోలీసుల దర్యాప్తునకు సుశీల్ అసలేమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. అయితే, సాగర్ రాణా మృతితో పాటు.. తీవ్రంగా గాయపడిన మరో రెజ్లర్.. ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ సందీప్‌కు మేనల్లుడు కావడంతో.. అతని నుంచి ప్రాణభయంతో అన్నాళ్లూ తప్పించుకుని తిరిగినట్టు పోలీసులకు చెప్పాడని సమాచారం. కాగా, సుశీల్‌కుమార్ సెల్‌లో రాత్రిళ్లు ఏడుస్తున్నాడని.. సరిగా నిద్ర పోవడం లేదని అంటున్నారు.