తిరుమలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, చంద్రబాబు
posted on Sep 25, 2025 2:51PM

తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలిసి తిరుమలలో పలు కీలక అభివృద్ధి పనులను గురువారం (సెప్టెంబర్ 25) ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన 'వేంకటాద్రి నిలయం' యాత్రికుల వసతి సముదాయాన్ని ఉపరాష్ట్రపతి, సీఎం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు, శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విజన్ బేస్డ్ స్టోరింగ్ మెషిన్‌కు ప్రారంభించారు. అంతకుముందు వెంకటాద్రి నియలం ప్రాంగణానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి, ముఖ్య మంత్రికి టీటీడీ అధికారులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసిన అనంతరం వారు భవనాన్ని కలియతిరిగి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
వసతి గృహం బుకింగ్ కౌంటర్ పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం, తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను (ఐసీసీసీ) కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ఆయన వెంట ఉన్నారు. రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.