నక్సల్ విముక్త భారత్ దిశగా వేగంగా అడుగులు?
posted on Sep 25, 2025 1:49PM

మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యుల హతం కాగా.. నేడు ఏకంగా 71 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తాజాగా దంతెవాడ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టులలో ఇరవై మందికి పైగా 64 లక్షల రూపాయల రివార్డు ఉంది. లోంగిపోయిన వారిలో 21 మంది మహిళలు కాగా.. ఒక బాలుడు, ఇరువురు బాలికలు సైతం ఉన్నారు. మావోయిస్టులకు వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు చూస్తుంటే.. మావోయిస్టు ఉద్యమం ఉనికి ప్రశ్నార్ధంలా కనిపిస్తోంది. ఒక సమయంలో మావోయిస్టు నేత జగన్ అన్న మాటలను బట్టి చూస్తే.. ఇకపై తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న వారి ప్రాబల్యం బాగా తగ్గి.. కేవలం గిరిజనులు మాత్రమే మావోయిస్టుల్లో ఉంటారని అన్నారాయన. దీనంతటికీ కారణమేంటంటే.. తుపాకీ గొట్టం ద్వారా సాధారణ యువత ప్రభుత్వాలతో తేల్చుకునే పరిస్థితి బొత్తిగా కనుమరుగవ్వడమే అంటున్నారు. వీరంతా స్టార్టప్ ల ద్వారా ఉద్యోగితను పెంచడంలో బాగా బిజీగా ఉన్నారు. దీంతో నాగరిక యువత అడవుల బాట ఇకపై కనిపించక పోవచ్చు.
కొందరు అమెరికా హెచ్ 1 బీ వీసా ఎంత కష్టతరమైనా సరే సాధించడానికి ముందుకొస్తున్నట్టు కనిపిస్తోంది. బెంగళూరుకు చెందిన తనూశ్ శరణార్ధి అనే యువకుడు మూడు సార్లు ట్రై చేసి ఎట్టకేలకు అనుకున్న వీసా పొందాడు. తాను ఎంతో కష్టపడి.. ఏఐపై పట్టు సాధించానని.. దీంతో తనకు 0- 1 వీసా అప్రూవ్ అయిందని అంటున్నాడు శరణార్ది. దీన్నే ఐన్ స్టీన్ వీసా అంటారు. ఇది ఎంతో టాలెంట్ ఉన్న వారికి తప్ప సాధ్యంకాదు. ఇక పోతే.. ఈ ప్రపంచ గతిని మార్చిన మూడు సీలు ఏంటంటే క్రీస్ట్, కమ్యూనిజం, కంప్యూటర్. ప్రస్తుతం కమ్యూనిజాన్నిక్రాస్ చేసి కంప్యూటర్ జమానాలో ఉన్నాం. వచ్చే రోజుల్లో అది క్వాంటం కంప్యూటింగ్ లోకి వెళ్లనుంది. ఇలాంటి అడ్వాన్స్డ్ సిట్యువేషన్స్ లో.. యువత అడవుల్లోకి వెళ్లి తమ భవిష్యత్తును వెతుక్కోవాలని భావించడం లేదు. సరికదా విండోస్ లోంచి క్లౌడ్ లోకి వెళ్లి సమస్తం అక్కడి నుంచే పుట్టించేయత్నం చేస్తున్నారు. దీంతో వారికి ఫలానా అని ప్రభుత్వాలతో గొడవే లేదు.
అసలు మావోయిజం బేసిక్ థియరీ.. ప్రభుత్వాల నుంచి అధికారం లాక్కుని.. దాని ఫలాలు అందని వారికి అందించడం. ఇటు ప్రభుత్వం కూడా ఆ ఫలాలను అడవుల్లోకి కూడా అందేలా చేస్తూ.. అక్కడా బడి, రోడ్డు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తూ.. వారి వారి జీవితాల్లోనూ మార్పు వచ్చేలా చేస్తోంది. కాబట్టి.. ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీల్లోనూ ప్రస్తుతం విప్లవంలోకి దిగాలన్న ఆలోచన ఏమంతగా రావడం లేదు. వారు సైతం జన జీవనంలోకి సులువుగా కలగలసి పోతున్నారు.
ఇక మిగిలింది అడవుల్లోని మావోయిస్టు అవశేషం మాత్రమే. ఇదిగో ఇప్పుడు ఈ యువత కూడా జనజీవనంలోకి అడుగు పెడుతుండటంతో.. ఇక మిగిలింది చాలా తక్కువ మొత్తంలోని వృద్ధ, కొసరు మాత్రమే. వార్ని కూడా 2026 మార్చినాటికి ఏరి పారేయనుంది.. కేంద్రం. దీంతో జీరో మావోయిజం ఇన్ భారత్ అన్న కేంద్ర లక్ష్యం సాకారం కావడానికి పెద్దగా సమయం పట్టేలా కనిపించడం లేదు.
ఇప్పటికే మావోయిస్టుల్లోనే చీలిక వచ్చింది. ఆయుధం వదిలేద్దామని కొందరు.. లేదు కొనసాగిస్తామని మరి కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలు కూడా ఎక్కువ కాలం నిలిచేలా లేవు. దీంతో.. వచ్చే రోజుల్లో రెండో సీల్లోని కమ్యూనిజం దాదాపు తన ఉనికి కోల్పోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే జన బాహుళ్యంలోని కమ్యూనిస్టు పార్టీలు జాతీయ హోదా కోల్పోయి రాష్ట్ర హోదాలోకి.. వచ్చేసిన రోజుల్లో అందులోంచి కూడా బయటకు రానున్న క్రమంలో.. ఇక సెకండ్ సీ యొక్క ప్రభావం పూర్తిగా కనుమరుగయ్యేలా తెలుస్తోందని అంటున్నారు కొందరు సామాజిక వేత్తలు. ఫైనల్ గా మిగిలిన అర్బన్ నక్సల్స్ పై కూడా ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో ఇకపై ఇటు నగరంలో అటు అడవుల్లో అన్నల ప్రస్తావనే లేకుండా పోయేలా తెలుస్తోంది.