ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్... మరో సిట్ ఏర్పాటు

 

తెలంగాణలో రాజకీయంగా సంచలనం సృష్టించిన.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు నమోదైన 21 నెలల తర్వాత.. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం.. టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. దీంతో.. ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుందనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఐదుగురు ఐపీఎస్‌లు సహా తొమ్మిది మంది పోలీసు అధికారులతో.. డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. గతంలో డిపార్ట్మెంట్ పరంగా సిట్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రభుత్వపరంగా సిట్ ఏర్పాటు అయింది. 

మొన్నటిదాకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరినే.. మరోసారి సిట్ దర్యాప్తు అధికారిగా నియమించడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితులను గుర్తించారు. వారితో పాటు వందల మంది సాక్షుల వాంగ్మూలాలు సేకరించారు. ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో జరగబోయే దర్యాప్తులో.. ఇంకా ఎవరు బయటికొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అధికారులు దర్యాప్తు చేసినా.. ఇన్వెస్టిగేషన్‌ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం జరిగిందే ప్రచారం జరుగుతున్న క్రమంలో.. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారనే కోణంలో ఈసారి దర్యాప్తును విస్తృతం చేసే అవకాశముంది. 

ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌లో అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడటం ద్వారా.. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సహకరించారనే ఆరోపణలతో.. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. అప్పట్లోనే టాస్క్‌ఫోర్స్‌ రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్‌రావును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని విచారణలోనే.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి.. 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు అమెరికాలో తలదాచుకోవడంతో.. రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించి భారతదేశానికి రప్పించారు. 

వారిని రప్పించినా.. ఎస్‌ఐబీలో కీలక ఆధారాలను ధ్వంసం చేయడంతో దర్యాప్తులో పురోగతి కనిపించలేదు.
సిట్ విచారణలో.. కీలక నిందితుడు ప్రభాకర్ రావు నోరు విప్పలేదు. కీలక సమాచారం ఏదీ ఇవ్వలేదని సిట్ తెలిపింది. అధికారుల ఆదేశాలతో.. అంతా రూల్స్ ప్రకారమే చేశానని చెప్పినట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు, వ్యాపారస్తులు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై ప్రభాకర్ రావు స్పష్టత ఇవ్వలేదు. రివ్యూ కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందని సమాధానమిచ్చారు. హార్డ్‌ డిస్కుల ధ్వంసం కూడా నిబంధనల ప్రకారమే చేశానన్నారు. ఈ-మెయిల్, క్లౌడ్ డేటాలో వ్యక్తిగత సమాచారం మాత్రమే డిలీట్ అయిందని తెలిపారు. 

ట్యాపింగ్ డివైజ్‌లు అమెరికాలోనే మరిచిపోయానని తెలిపారు. కానీ.. అసలు సూత్రధారులపై సమాచారం ఇవ్వలేదు. దాంతో.. దర్యాప్తు ముందుకు కదల్లేదు. పైగా.. ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో చెప్పిన ఉన్నతాధికారులను విచారించేందుకు అవాంతరాలు ఎదురవడంతో.. ఈ కేసు విచారిస్తున్న సిట్ టీమ్ ముందుకెళ్లలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. వారిని విచారిస్తే గానీ.. కేసు దర్యాప్తు కొలిక్కి రాదనే అభిప్రాయాలు వ్యక్తమైనా.. ఇన్నాళ్లూ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ వ్యవహారం వెనుక.. అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతలున్నా.. ఆధారాల్ని ధ్వంసం చేశామనే ధీమాతోనే ప్రభాకర్ రావు వాస్తవాలను చెప్పడం లేదని అనుమానిస్తున్నారు. 

ఈ క్రమంలోనే.. మరింత లోతుగా విచారించేందుకు.. ఉన్నతాధికారులు, నాయకుల గుట్టు విప్పేందుకే.. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావుకు మరో షాక్ తగిలింది. సిట్ దర్యాప్తునకు సహకరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన కస్టడీని డిసెంబర్ 25 దాకా పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు కస్టడీ ఇంటరాగేషన్ స్టేటస్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు.

 ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదని.. ఇంకొన్ని రోజులు విచారణ జరిపేందుకు.. కస్టడీ పొడిగించాలని.. ప్రభుత్వం తరఫు లాయర్లు కోరారు. ఇందుకు ఏకీభవించిన ధర్మాసనం ప్రభాకర్ రావు కస్టడీని వారం పొడిగించింది. ఆ మరుసటి రోజే.. ఆయన్ని విడుదల చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ సమయంలో.. తదుపరి విచారణ దాకా.. ప్రభాకర్ రావు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను.. జనవరి 16కు వాయిదా వేసింది. అయితే.. ఇన్నాళ్లూ తేల్చనిది.. ఈ నెల రోజుల్లో కొత్తగా గవర్నమెంట్ వేసిన సిట్ ఏం తేల్చబోతోందనేది ఆసక్తి రేపుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu