పీపీపీకి మద్దతిస్తే అరెస్టులా...జగన్ బెదిరింపులపై పల్లా ఫైర్
posted on Dec 19, 2025 4:39PM

పీపీపీ విధానానికి మద్దతిచ్చిన వారిని అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఘాటుగా మండిపడ్డారు. మనం డా.బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో జీవిస్తున్నాం. నీ తాత రాజారెడ్డి రాసిన రాజ్యాంగంలో కాదు అంటూ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పబ్లిక్–ప్రైవేట్ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంటే, పీపీపీకి మద్దతిచ్చిన వారిని జైలుకు పంపుతామని బెదిరించడం నియంతృత్వ ఆలోచనలకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజల చేతిలో ఇప్పటికే గుణపాఠం నేర్చుకున్నప్పటికీ జగన్ ఇంకా మారలేదని, అదే అహంకారంతో మళ్లీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
పీపీపీకి మద్దతిచ్చిన వారిని అరెస్టు చేస్తామని భయపెట్టడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారిని జగన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ పాలనలోనే అనేక పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని గుర్తు చేశారు.
జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరు జడిచేది లేదని, చట్టాలు ఎవరు అతిక్రమించినా జైలు ఊసలు లెక్కించాల్సిందేనని పల్లా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పారని, రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
గవర్నర్ వద్దకు తీసుకెళ్లిన ఒక కోటి సంతకాలు నిజమైతే, వాటికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను మీడియాకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు. ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు వైసీపీ ఎంపీలు పీపీపీ మోడల్‌కు మద్దతు ఇచ్చి, రాష్ట్రానికి వచ్చాక దానికే వ్యతిరేకంగా ఫేక్ ఉద్యమాలు చేయడం డిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట అనే జగన్ రాజకీయ నాటకానికి నిదర్శనమన్నారు.
పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న విధానమని పల్లా స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతోనే నడుస్తాయని, వాటి యాజమాన్యం, పరిపాలన, పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని తెలిపారు.
అడ్మిషన్లు, ఫీజు నిర్మాణం, సేవల ప్రమాణాలు అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ప్రైవేట్ భాగస్వామికి ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం లేదన్నారు. ఈ కాలేజీల్లో 70 శాతం పడకలు ఎన్టీఆర్ వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ పథకాల లబ్ధిదారులకే కేటాయిస్తారని, దీని ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
జగన్ పాలనలో మెడికల్ కాలేజీల పేరుతో కేవలం రూ.1,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అవి కూడా కేంద్ర నిధులేనని పల్లా గుర్తు చేశారు. ఇప్పుడు రూ.3,000 కోట్లు ఖర్చు చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రూ.450–500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించినప్పుడు పేదల ఆరోగ్యం, సంక్షేమం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
అదే డబ్బుతో కనీసం రెండు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని, కానీ ప్రజలకు ఉపయోగం లేని వైట్ ఎలిఫెంట్‌గా రుషికొండ ప్యాలెస్ మిగిలిందని విమర్శించారు. మీ సాక్షి పత్రికే రుషికొండకు రూ.450 కోట్లు ఖర్చయిందని రాసిందని, ఇప్పుడు రూ.230 కోట్లు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని నిలదీశారు. మిగిలిన డబ్బు ఎవరికి కమీషన్లుగా వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
నీ పాలనలోనే 104, 108 సేవలను ప్రైవేటైజ్ చేశావని, ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయినప్పుడు ప్రజల ఆరోగ్యం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అమరావతి, పోలవరం, పరిశ్రమలను అక్కసుతో నాశనం చేసిన నువ్వు ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదని పల్లా మండిపడ్డారు.
రుషికొండపై చూపిన ప్రేమను నర్సీపట్నం మెడికల్ కాలేజీపై చూపి ఉంటే అది ఇప్పటికి పూర్తయ్యేదని అన్నారు. 30 ఏళ్లు పట్టే మెడికల్ కాలేజీలను కేవలం రెండేళ్లలో పూర్తి చేసే పీపీపీ విధానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావని ప్రశ్నించారు. మీ వాటాదారులకు కమీషన్లు పోతాయనే భయమే దీనికి కారణమా అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి పేదల సంక్షేమమే లక్ష్యంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేశారని పల్లా తెలిపారు. ఈ విధానంతో అదనంగా 220 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తాయని, అందులో 110 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలోనే ఉంటాయని చెప్పారు. రెండేళ్లలోనే కాలేజీలు పూర్తై 2,500 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.
జగన్ విధానంలో అయితే ఇదే ఫలితం సాధించడానికి 15–20 ఏళ్లు పట్టేదన్నారు. పీపీపీ విధానానికి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, నేషనల్ మెడికల్ కమిషన్, నీతి ఆయోగ్, హైకోర్టు కూడా పూర్తి మద్దతు ఇచ్చాయని టీడీపీ చీఫ్ గుర్తు చేశారు. వైద్య విద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పీపీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు.