గాన గంధర్వుడికి ప్రాంతీయత అంటగడతారా?

హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉండే  ర‌వీంద్ర భార‌తిలో గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న పై జరుగుతున్న రగడపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటుడు శుభ‌లేఖ సుధాక‌ర్ అధ్వ‌ర్యంలో ఎస్పీ బాలు విగ్ర‌హం ఇక్క‌డ  ఏర్పాటు చేసే విష‌యంలో కొందరు అనవసర వివాదానికి తెరలేపారు.  

ఆంధ్రప్రదేశ్ కు చెందిన  ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం విగ్ర‌హం తెలంగాణ‌లో స్థాపించడమేంటన్న చర్చను తెరపైకి తీసుకువచ్చి రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠాపనను వ్యతిరేకించడం ద్వారా కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేయడానికీ, ఆంధ్రా, తెలంగాణ మధ్య విభేదాల సృష్టికీ, తెలంగాణ సెంటిమెంట్ ను ప్రేరేపించడానికి ప్రయత్నించడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు బాలు అభిమానులు. ప్రజలు. ఆ మాట‌కొస్తే ఈ సాంస్కృతిక భ‌వ‌నానికి  పెట్టిన ర‌వీంద్ర భార‌తి అనే పేరు ఇక్క‌డ పుట్టిన వ్యక్తిది ఎంత మాత్రం కాదనీ,  బెంగాల్లో పుట్టిన రీవీంద్ర నాథ్ ఠాగూర్ పేరు మీద ఇక్కడ రవీంద్రభారతి వెలిసిందన్న సంగతని గుర్తు చేస్తూ, జాతీయగీతం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ కీ ప్రాంతీయత అంటగడతారా అని ప్రశ్నిస్తున్నారు. బాలూ కూడా జనం అందరూ మైమరిచి ఆలకించి పరవశించిపోయే మధుర గీతాలను పాడారనీ, ఆ గీతాలకు, మన చెవుల్లో అమృతం పోసిన ఆ గొంతుకకు ప్రాంతీయత అంటగట్టడం సరికాదనీ అంటున్నారు.  

 ఎస్పీ బాలు పాడిన పాట‌లు ఆంధ్ర, తెలంగాణ తేడా లేకుండా అంద‌రూ చెవులప్పగించి విన్నారు. వింటున్నారు.  ఆస్వాదించారు. ఆస్వాదించారు. పైగా బాలు పాటలంటే చెవికోసుకునే వారు  తెలంగాణలో కూడా అత్యధికంగా ఉన్నారు. మరి ఇంత కాలం బాలూ గానామృతాన్ని గ్రోలిన తెలంగాణ వాదులు  ఇప్పుడా ఆస్వాద‌న మొత్తం తిరిగిచ్చేస్తారా?  ఇవ్వగలరా? అని  నిలదీస్తున్నారు బాలు అభిమానులు. 

క‌ళ‌కు ఎల్ల‌ల్లేవు. క‌ళాకారుల‌కు త‌ర‌త‌మ బేధాలే  కాదు ప్రాంతీయ భాషాభిమానాలు కూడా  ఉండవు. ప్రాంతీయత పేరుతో బాలూ వంటి గాన గాంధర్వుడి ప్రతిభను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ఎవరికీ, ఎప్పటికీ సాధ్యం కాదు.  తెలంగాణకు చెందిన పైడిజ‌య‌రాజ్  ముంబై వెళ్లి అక్క‌డి హిందీ సినిమాల్లో రాణించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హించారు. న‌ల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు ఆనాడు తెలుగు సినిమాలో ఒక వెలుగు వెలిగారు. ఇక్కడి వారికి అంత‌టి ప్రాంతీయాభిమానం ఉంటే వారిద్ద‌రి విగ్ర‌హాలిక్క‌డ ఇప్పటి వరకూ ఎందుకు ప్ర‌తిష్టించ‌లేదు?  

ఎక్క‌డో బీహార్ కి చెందిన కేసీఆర్ పూర్వీకులు ఆంధ్ర‌ప్రాంతంలోని బొబ్బిలికి వ‌చ్చి అటు పిమ్మ‌ట తెలంగాణ‌లోని చింత‌మ‌డ‌క‌కు వ‌ల‌స వ‌చ్చారు. అలాంటి కేసీఆర్ తెలంగాణ సాధన కోసం పోరాడారు.  బీహారీ కేసీఆర్ సాధించిన‌  తెలంగాణ తిరిగి ఆంధ్ర‌లో క‌లిపేస్తారా?  కేసీఆర్ తెలంగాణ వ్యక్తి కాదంటూ ఆయనను డిజ్ ఓన్ చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు.  

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ సాయుధ  పోరాటంలో పాల్గొన్న చాక‌లి  ఐల‌మ్మ విగ్ర‌హాలున్నాయి. ఆ విగ్ర‌హాల‌నేమీ ఇక్క‌డి వారు వ‌ద్ద‌న‌డం లేదు. అంతెందుకు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో సుంద‌ర‌య్య వంటి ఎంద‌రో క‌మ్యూనిస్టు పోరాట యుధులు అండ‌గా నిలిచారు. మ‌రి వారి త్యాగాల‌ను తిరిగిచ్చేయ‌గ‌ల‌రా? అని కూడా నిలదీస్తున్నారు. 

మొన్న‌టికి మొన్న జూబ్లీహిల్స్ ఉప  ఎన్నిక‌ల్లో న‌వీన్ యాద‌వ్  గెలిస్తే మైత్రీవ‌నం ప్రాంతంలో .. ఎన్టీఆర్ విగ్ర‌హ స్థాప‌న చేస్తామ‌ని సాక్షాత్ సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఆ విగ్ర‌హ ఏర్పాటును కూడా ఇలాగే వ్య‌తిరేకిస్తారా?  అంతెందుకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు ఎన్టీఆర్ పేరునే తన కుమారుడు కేటీఆర్ కు పెట్టానని స్వయంగా కేసీఆరే చెప్పారు. అలాంటిది.. తన పాటల మాధుర్యాన్ని ప్రాంతాలకు అతీతంగా అందరికీ పంచారు. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణను అడ్డుకోవడం ఎంతమాత్రం సమజసం కాదు.   

రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగువారిగా కలిసుందాం అంటూ చంద్రబాబు, కేసీఆర్ సహా రాజకీయాలకు అతీతంగా నేతలందరూ విభజన సందర్భంగా ఉద్ఘాటించారు. అటువంటిది రాష్ట్ర విభజన జరిగి పదిహేనేళ్లు దాటిపోయిన తరువాత కుచ్ఛితమైన స్వార్థ రాజకీయాల కోసం మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణలను వివాదం చేయడం సరికాదంటున్నారు పరిశీలకులు. 

  ఎస్పీబీకి భార‌త ర‌త్న ఇవ్వాల‌ని త‌మిళ‌నాడు, కేర‌ళ నుంచి అభ్య‌ర్ధ‌న‌లు వెళ్లాయి.  ఎస్పీబీ త‌మిళుడు కాదు,  మ‌ల‌యాళీ కాదు అంటూ ప్రాంతీయ విభేదాలను చూపలేదు. మన తెలుగువారికి ఎందుకీ తెగులు అన్న ఆవేదన ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వ్యక్తం అవుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu