పొంగులేటి కుమారుడి కంపెనీపై కబ్జా కేసు
posted on Dec 4, 2025 8:41AM
.webp)
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన కనస్ట్రక్షన్ కంపెనీపై కేసు నమోదైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీ గండిపేట రెవెన్యూ పరిధిలోని వట్టినాగులపల్లిలో 300 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాకు ప్రయత్నించడంతో ఈ కేసు నమోదైంది. గత నెల 30న 70 మంది బౌన్సర్లను తీసుకెళ్లి ఆ భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేసి, స్థల యజమానిపై దాడి చేశారంటూ పల్లవి షా అనే మహిళ ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
గత నెల 30 అర్ధరాత్రి రాఘవ కన్స్ట్రక్షన్స్‌కు చెందిన పలువురు వ్యక్తులు, నంబర్ ప్లేట్లు లేకుండా తీసుకొచ్చిన జెసిబిలతో ఆ భూమిలోకి బలవంతంగా ప్రవేశించి ప్రహారీ గోడను కూల్చేయడమే కాకుండా, అక్కడ ఉన్న గోశాలలు, షెడ్లు, ధ్వంసం చేసినట్టుగా పల్లవీషా అనే మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో రాఘవ కన్స్ట్రక్షన్స్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అక్రమ ప్రవేశం, ఆస్తి ధ్వంసం వంటి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తు న్నామని పోలీసులు తెలిపారు.
ఇలా ఉండగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదు కావడం కాంగ్రెస్ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అన్నిటికీ మించి రేవంత్ కేబినెట్ లో అత్యంత కీలకంగా ఉన్న పొంగులేటి కుమారుడికి చెందిన కనస్ట్రక్షన్ కంపెనీ దౌర్యన్యంగా కబ్జాకు ప్రయత్నించిందన్న ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది.