ఐపీఎల్ వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ల హవా

ఎప్పట్లాగే ఈసారి కూడా ఐపీఎల్ వేలం కొందరు ఊరూ పేరూ కూడా పెద్దగా తెలియని ప్లేయర్ల జాతకాలు మార్చేసింది. ఇప్పటి వరకు వారి పేర్లు కూడా ప్రపంచానికి తెలియని ప్లేయర్లను కోటీశ్వరులను చేసింది. అదే  సమయంలో  మల్టీట్యాలెంటెడ్ ప్లేయర్లపై కాసులు కురిపించింది. అన్ని ఫ్రాంచైజీలూ తమ జట్లలోని లోటు పాట్లను సరిదిద్దు కోవడానికి అందుకు పనికొస్తారని భావించిన  ఆటగాళ్ల కోసం గట్టిగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కేకేఆర్ ఏకంగా  25.20 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా నిలిచాడీ  ఆసీస్ యంగ్ ప్లేయర్.

అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబర్ 16) జరిగిన వేలంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. రూ.25.20 కోట్లతో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా రికార్డు స్టృష్టించాడు. భారీ పర్సుతో వేలంలో దిగిన కేకేఆర్ అతన్ని కొనుగోలు చేసింది. ముంబై, రాజస్థాన్ తదితర ఫ్రాంచైజీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న కేకేఆర్, గ్రీన్‌ను మాత్రం వదలకుండా పట్టుకుంది. అలాగే శ్రీలంక పేసర్ మతీష పతిరాణాను కూడా రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. వీళ్లిద్దరే ఈ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్లు కావడం గమనార్హం.

అన్ని ఫ్రాంచైజీలూ స్టార్ ప్లేయర్ల వెంట పడతారనుకుంటే.. ఈసారి వేలంలో దేశవాళీ ప్లేయర్ల కోసం హోరాహోరీ పోరు జరిగింది. రాజస్థాన్ వికెట్ కీపర్ కార్తిక్ శర్మ, యూపీ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం గట్టిపోటీ ఎదుర్కొన్న సీఎస్కే.. వీళ్లిద్దర్నీ చెరో రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ నుంచి కుర్రాళ్లపై ఫోకస్ పెట్టిన ఈ టీం.. ఈసారి కూడా కుర్రప్లేయర్లతో జట్టులో జోష్ నింపేందుకు రెడీ అవుతోంది. తమకు ఇంత భారీ ధర పలుకుతుందని ప్రశాంత్, కార్తీక్ ఇద్దరూ అనుకోలేదు. వీళ్లిద్దరే కాదు జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ దార్‌కు రూ.8.40 కోట్లు దక్కగా.. మధ్యప్రదేశ్ యంగ్‌స్టర్ మంగేష్ యాదవ్‌కు రూ.5.2 కోట్ల ధర లభించింది. అలాగే ఢిల్లీ వికెట్ కీపర్ తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రాజస్థాన్ క్రికెటర్ ముకుల్ చౌదరీ (రూ.2.6 కోట్లు) దక్కించుకున్నారు. వీరంతా కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలో నిలిచిన వారే కావడం గమనార్హం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu