ఏపీకి రెండు హైస్పీడ్ రైల్వే కారిడార్లు
posted on Oct 23, 2025 4:27PM

ఏపీలో రవాణా వ్యవస్థ రూపురేఖలు మారిపోనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ రెండు ప్రతిష్ఠాత్మకమైన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి రూట్ మ్యాప్‌ను ఖరారు చేసింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.5.42 లక్షల కోట్లు. ఈ రూట్ మ్యాప్ ప్రకారం ఎక్కువ మార్గం ఏపీ మీదుగానే వెడుతుంది.
మొత్తం 1,365 కిలోమీటర్ల పొడవైన ఈ రెండు కారిడార్లలో సుమారు 767 కిలోమీటర్ల మార్గం ఆంధ్రప్రదేశ్ భూభాగం గుండానే వెడుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్-బెంగళూరు మార్గానికి రూ.2.38 లక్షల కోట్లు, హైదరాబాద్-చెన్నై మార్గానికి రూ.3.04 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.
హైదరాబాద్-బెంగళూరు కారిడార్ మొత్తం పొడవు 605 కిలోమీటర్లు. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గుండా సాగుతుంది. ఈ నాలుగు జిల్లాలలోనూ కలిపి 263 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ను నిర్మితమౌతుంది. ఈ మార్గంలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురంలో ఆరు కొత్త స్టేషన్లు రానున్నాయి. మరోవైపు హైదరాబాద్-చెన్నై కారిడార్ మొత్తం పొడవు 760 కిలోమీటర్లు కాగా ఇది రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా 504 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించనున్నారు.
ఈ కారిడార్‌లో దాచేపల్లి, నంబూరు, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతిలో మొత్తం 9 ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మార్గానికి తరువాత దశలో అమరావతిని కూడా అనుసంధానించే అవకాశా లున్నాయని రైల్వే వర్గాల ద్వారా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన సర్వే పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నట్లు సమాచారం.