శిథిలాల కిందే నవజాత శిశువు.. పక్కనే తల్లిమృతదేహం

మాటలకందని మహా విషాదం.. టర్కీ భూకంపం. వేలాది మంది మృత్యువాత పడ్డారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా వేల మంది కుప్పకూలిన భవన శిథిలాల కింద బతికున్నారో లేదో తెలియని స్థితి.  టర్కీ, సిరియాలను పెను భూకంపం కుదిపేసింది. వందల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న సహాయక బృందాలు గుట్టలు గుట్టలుగా మృతదేహాలను వెలికి తీస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆ క్రమంలోనే హృదయం ద్రవించుకుపోయే ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణి భూకంప శిథిలాల కిందే పండంటి శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం జరిగీ జరగగానే కన్నుమూసింది.

శిథిలాల తొలగింపులో ఆ శివువును గుర్తించిన సహాయక బృందాలు ఆ శిశువును వెలికి తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వణికించే చలిలో గంటల పాటు తల్లి మృతదేహం పక్కన ఒంటిమీద నూలుపోగు లేకుండా ఉన్న ఆ నవజాత శిశువు దుస్థితికి అందరూ కంటతడి పెడుతున్నారు. ఆ శిశువు బతకాలని ప్రార్ధిస్తున్నారు.  .